పీఆర్సీ ఎప్పుడిస్తారు?

 పీఆర్సీ ఎప్పుడిస్తారు?

సీపీఎస్‌ను ఎప్పుడు రద్దు చేస్తారు?

పథకాల తరహాలో తేదీలు ప్రకటించండి: పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు పీఆర్సీ ఎప్పుడిస్తారు? సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం సభలో సమాధానం చెప్పాలని శాసనమండలిలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఉద్యోగులకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ప్రభుత్వ పథకాలకు తేదీలు ప్రకటించి ఇస్తున్నట్లే పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తేదీలు చెప్పాలన్నారు. శుక్రవారం శాసనమండలిలో ఉద్యోగుల సంక్షేమంపై జరిగిన చర్చలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం యంత్రాల్లా చూస్తోందన్నారు. ఉద్యోగుల హక్కులను లాగేసుకుందని విమర్శించారు.

హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై అణచివేత కొనసాగుతోందన్నారు. 2018 జూలై నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు పీఆర్సీ ఇవ్వాల్సి ఉందని, ప్రభుత్వం ఇప్పటికీ నివేదిక కూడా బయటపెట్టలేదన్నారు. ఇప్పటికీ ఎన్నో విధానాలను మార్చుకున్నట్లుగా వీటిపైనా అభిప్రాయం మార్చుకున్నారా? సభా ముఖంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పట్టించుకోదని 10లక్షల మంది ఉద్యోగులకూ అర్థమైందని, ఇక తాము వారితో కలిసి పోరాడడమే శరణ్యమన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపడంలేదన్నారు. ఇప్పటి వరకు ఓపిక పట్టామని ఇక పోరాడతామన్నారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం విస్మరించిందన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. పీఆర్సీపై సీఎం జగన్‌ రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నారు. 

ఆర్థిక పరిస్థితి బాగాలేదు: బుగ్గన 

పీఆర్సీ ప్రక్రియ కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉందని, సీపీఎ్‌సపై కమిటీలు వేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. కాగా పీఆర్సీ ఎప్పుడుస్తారు, సీపీఎస్‌ రద్దు గురించి చెప్పకుండానే శాసనమండలిలో దాటవేత ధోరణితో జవాబు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, ముందుగా పూటగడవని 90శాతం మంది సంక్షేమానికి తొలిప్రాధాన్యం ఇచ్చామన్నారు. పీఆర్సీపై పలు సమావేశాలు జరిగాయని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ కూడా వేశామన్నారు. నివేదిక కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉందన్నారు. సీపీఎ్‌సపై మంత్రులు, సీఎస్‌ అధ్యక్షత వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కేఏ పండిట్‌ కమిటీని కూడా వేశామన్నారు.  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి కమిటీలు వేశామని తెలిపారు. 2018 డీఎస్సీ ఉద్యోగులకు సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్లే జీతాలు రాలేదని, సరిచేస్తామని హామీ ఇచ్చారు. సీఎంకు ఉద్యోగులంటే గౌరవం ఉందని, సహకరించాలని కోరారు.  

Flash...   Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్ తీసుకోవాలా ? బూస్ట‌ర్ షాట్ అంటే ఏమిటి ?

జగన్‌ హామీ నీటి మూటలేనా?: ఉద్యోగుల సంఘం 

సీపీఎస్‌ రద్దుపై మంత్రి బుగ్గన మాటలు ఉద్యోగులను వంచించేలా ఉన్నాయని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం.దాస్‌ మండిపడ్డారు. సీపీఎస్‌ రద్దుపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆ కమిటీ వేశాం.. ఈ కమిటీ వేశాం అని బుగ్గన చెబుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని జగనన్న ఇచ్చిన హామీలు నీటి మూటలేనా అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే సీపీఎస్‌ రద్దు చేసి పాతపెన్షన్‌ విధానం అమలు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్‌ చేశారు.