అమ్మఒడితో రెవిన్యూ లోటు-ఏపీలో ఆర్దిక క్రమశిక్షణ లోపించింది : పార్లమెంట్ లో కేంద్ర మంత్రి..!!
ఏపీలో ఆర్దిక కష్టాలు చుట్టుముట్టిన సమయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీని ఆదుకోవాలంటూ లోక్ సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఏపీలో ఆర్దిక సమస్యలను మిధున్ రెడ్డి సభలో కేంద్రానికి నివేదించారు. ఇక, రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులు..ఆర్దిక సంక్షోభం పైన స్పందించారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు.
ఏపీ ప్రభుత్వం విఫలం
2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆదాయాన్ని వాస్తవికంగా అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్లు నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. రెవెన్యూ వ్యయాన్ని నియంత్రించలేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం కాలావధి మొత్తంతో పాటు, 15వ ఆర్థిక సంఘం పరిధిలోని 2020-21లో రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేసినా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటులో పెరుగుదల కనిపించినట్లు వివరించారు. 2015-16తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ఉదయ్ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందుకు ఖర్చు చేయడమేనన్నారు.
ఆ పధకాలతోనే రెవిన్యూ లోటు:
అమ్మఒడి, ఉచిత విద్యుత్ సరఫరా తదితర అనేక పథకాల వల్ల రెవెన్యూ లోటు అనూహ్యంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూ వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు గత ఎనిమిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల వాటా కింద మొత్తం రూ.4,40,985 కోట్ల ఆర్థిక వనరులు అందించినట్లు ఆర్థికమంత్రి వివరించారు. రెవెన్యూ లోటు అంచనా 5,897కోట్లు ఉండగా, వాస్తవిక రెవెన్యూ లోటు 34,926.80కోట్లకు పెరిగిందని చెప్పారు. కాగ్ నివేదిక ఆధారంగా పన్నుల రూపంలో రాష్ర్టానికి 29,935.32కోట్లు, గ్రాంట్‌గా 57,930.62కోట్లు, రుణాల కింద 2వేల కోట్లు విడుదల చేశామన్నారు.
హామీలు నిలబెట్టుకోవాలన్న మిథున్ రెడ్డి 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం పన్నుల రూపంలో 77,398కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా, 57,377.97కోట్లు మాత్రమే సమకూరిందని తెలిపారు. పన్నులేతర రెవెన్యూ 5,267కోట్లు వస్తుందని అంచనా వేయగా 3,309.61కోట్లే వచ్చిందన్నారు. ఇటు లోక్ సభలో మిథున్ రెడ్డి ఏపీలో పరిస్థితిని వివరిస్తూనే… ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసారు. విభజన హామీల అమలు తీరు.. ఒక రాష్ట్రానికి సాయం చేయడానికి ఓ రాజు పలువురు తెలివైనవారి సలహాలు తీసుకుని పులిని చేయబోయి పిల్లిని ఆవిష్కరించినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు, పెట్రోకారిడార్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. విభజన సమయంలో ఎన్డీయే, యూపీఏ రెండూ రాష్ట్రానికి హామీలిచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలని కోరారు.