ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి
ఉద్యోగులపట్ల సీఎం సానుకూలంగా ఉన్నారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థంచేసుకోవాలి
ఉద్యోగులంతా ప్రభుత్వానికి అండగా ఉన్నారు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: 11వ పీఆర్సీని వారం రోజుల్లో ఇస్తామని సీఎం వైఎఎస్ జగన్ చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. సీఎం ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ఆయన సానుకూలంగా ఉన్నారని చెప్పారు.
పీఆర్సీని చూపించి కొన్ని ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపట్టాయని, వీటిపై ఆలోచించాలన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా పనిచేస్తానని చెప్పారు. బకాయి ఉన్న డీఏలో ఒక డీఏను జనవరిలో ఇచ్చేందుకు ఇప్పటికే ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఉద్యోగులు అడక్కుండానే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. 15 ఏళ్లుగా ఎప్పుడు జరగని జాయింట్ స్టాఫ్‌కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు