Tension : Hyderabadలో రెండు Omicron కేసులు బయటపడటంతో పరిస్థితి ఎలా ఉందో చూడండి..
హైదరాబాద్ సిటీ : నగరంలోని టోలిచౌకిలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు బయటపడడంతో అలజడి మొదలైంది. బాధితులు కలిసిన వ్యక్తులను గుర్తించి వారి నమూనాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజుకు 80లోపు మాత్రమే నమోదు అవుతున్నాయి. దీంతో అందరూ యధావిధిగా దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. నగరానికి ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి టూరిస్టులు, విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం చాలా మంది వస్తుంటారు. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాకపోకల క్రమంలో వైరస్ విస్తరించే ముప్పు ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
చదవండి : ఓమిక్రాన్ తీవ్రత ఎంత ?
గుమిగూడొద్దు..
ప్రస్తుతం పూజల కాలం. అలాగే శుభకార్యాలు కూడా బాగానే జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో పండుగ సంబరాలు మొదలవుతాయి. ఆయా సందర్భాల్లో చాలా మంది గుమిగూడే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో కొత్త వేరియంట్ ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వాతావరణానికి కాస్త దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
చదవండి : ఈ వేరియంట్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందామా..
టీకా తీసుకున్నా..
కొత్త రకం వేరియంట్లతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. టీకా రెండు డోసులూ తీసుకున్నా జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, ఫంక్షన్లకు దూరంగా ఉండడం మంచిదని పేర్కొంటున్నారు.
టిమ్స్‌కు తరలింపు..
కొవిడ్, కొత్త వేరియంట్ కేసులను కూడా ప్రస్తుతం గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలిస్తున్నారు. తాజాగా గుర్తించిన ఇద్దరికి కూడా అక్కడే చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఐసీయూ వార్డులు, ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లను సిద్ధం చేస్తున్నారు. టిమ్స్‌లో 175 ఆక్సిజన్ పడకలను సిద్ధం చేశారు. చెస్ట్ ఆస్పత్రిలో 28 ఐసీయూ, 303 పడకలను సిద్ధం చేశారు. కొవిడ్ కేసులకు గాంధీ ఆస్పత్రి నోడల్ కేంద్రంగా ఉంది. ఒమైక్రాన్ తీవ్రతను బట్టి మెరుగైన చికిత్సలకు గాంధీ ఆస్పత్రిని కూడా వినియోగించుకోవడానికి వైద్యాధికారులు సిద్ధమవుతున్నారు.
చదవండి : AP ప్రజలకు BIG ALERT: ఇకపై కఠిన ఆంక్షలు
కొవిడ్ పరీక్షలు పెంపు
నగరంలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. విదేశాల నుంచి నగరానికి చేరుకుంటున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. ఒమైక్రాన్ నేపథ్యంలో కొవిడ్ పరీక్షలను పెంచే ఏర్పాట్లు చేస్తున్నారు. 250 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్ల వద్దకు మొబైల్ వాహనాలను పంపించి నమునాలు సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారి నమూనాలను కూడా సేకరిస్తున్నారు. పాజిటివ్ వస్తే జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు నమూనాలు పంపించి నిర్దారించుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాక్సినేషన్‌ను విస్తృతం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. అందరూ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు.
టోలిచౌకిలో శానిటైజేషన్
గరంలో ఒమైక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. బుధవారం టోలిచౌకిలోని పలు ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావకం పిచికారి చేశారు. మరోపక్క వైద్యారోగ్య శాఖ ఇచ్చిన వివరాల ఆధారంగా టోలిచౌకిలోని పాజిటీవ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తులు ఉన్న బహుళ అంతస్తుల భవనంతోపాటు, చుట్టూ పక్కల 30 ఇళ్ల వద్ద శానిటైజేషన్ చేసినట్టు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం పేర్కొంది. నగరానికి వచ్చిన అనంతరం వారు వెళ్లిన బంధువులు, స్నేహితుల ఇళ్ల (కాంటాక్ట్ కేసులు) వద్దా క్రిమిసంహారక ద్రావకం పిచికారి చేశారు. నేడు, రేపు కూడా ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తామని ఓ అధికారి చెప్పారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. శానిటైజేషన్, ఇతర పనుల సమన్వయానికి సర్కిళ్ల వారీగా నోడల్ అధికారులను నియమించారు.