వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌‌లో ఒకరో, ఇద్దరో కాదు బాబోయ్..!


వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌‌లో ఒకరో, ఇద్దరో కాదు బాబోయ్..!

విజయవాడలో రెండు చెడ్డీ గ్యాంగ్‌లు

ఒక్కో గ్యాంగ్‌లో ఐదుగురు చోరులు

పోలీసుల అదుపులో ‘గ్యాంగ్‌లీడర్‌’?

పరారీలో ఏడుగురు

ముగ్గురి జాడ పసిగట్టిన పోలీసులు

ఒకరో, ఇద్దరో కాదు.. మొత్తం పది మంది.. విజయవాడలో చోరీలకు దిగిన చెడ్డీగ్యాంగ్‌ సభ్యుల సంఖ్య ఇది. మొత్తం రెండు గ్యాంగ్‌లు విజయవాడలో అడుగుపెట్టాయి. ఒక్కో గ్యాంగ్‌లో ఐదుగురు ఉన్నారు. పెనమలూరు మండలం పోరంకి వసంతనగర్‌, తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్లలో ఒక గ్యాంగ్‌ చొరబడింది. చిట్టినగర్‌లోని సీవీఆర్‌ ఫ్లైఓవర్‌ పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌, గుంటుపల్లిలోని నల్లూరి ఎన్‌క్లేవ్‌లో రెండో గ్యాంగ్‌ చోరీలకు దిగింది. ఒక గ్యాంగ్‌ లీడర్‌ను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రెండో గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యుల జాడను దాహోద్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసుల సహకారంతో గుర్తించారు. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడలో సంచరిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ ఉత్తర భారతదేశం నుంచి తరలివచ్చినట్టు తెలుస్తోంది. ఒక గ్యాంగ్‌ నివాస ప్రాంతం దాహోద్‌ నగరం కాగా, రెండో గ్యాంగ్‌ది దాహోద్‌ – మధ్యప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంగా గుర్తించారు. ఈ రెండు గ్యాంగ్‌లూ ప్రస్తుతం స్వస్థలాల్లో లేవు. ఒక గ్యాంగ్‌లో లీడర్‌, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రెండో గ్యాంగ్‌లో సభ్యులంతా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. పోలీసుల గాలింపుల్లో రెండో గ్యాంగ్‌ లీడర్‌ దొరికినట్టు సమాచారం. సీసీఎస్‌ పోలీసులు అతడిని వెంటబెట్టుకుని దాహోద్‌ వెళ్లారు. అతడి ద్వారా రెండు గ్యాంగ్‌లకు సంబంధించిన మొత్తం సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

గాలింపు చర్యల్లో ప్రత్యేక బృందాలు

పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న వాళ్లంతా మధ్యప్రదేశ్‌లోని అటవీ ప్రాంతంలో ఉండవచ్చునని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. గ్యాంగ్‌లీడర్‌ విజయవాడలోనే ఉండడం, ఒక టీం సభ్యులు దాహోద్‌ పారిపోవడం వెనుక ఏదో వ్యూహం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. పోరంకి వసంతనగర్‌లో, తాడేపల్లిలోని అపార్‌మెంట్లలో చోరీల తరువాత మరో నేరం జరగలేదు. సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించి నిందితులను ఫొటోలను గుర్తించడంతో చెడ్డీగ్యాంగ్‌ చోరీలు ఆపేసింది. పోలీసుల నిఘా పెరిగిందని భావించిన తర్వాత దోచుకున్న డబ్బులు, బంగారంతో కొంతమంది సభ్యులను లీడర్‌ దాహోద్‌కు పంపేశాడు. రెండో గ్యాంగ్‌లోని లీడర్‌, మరో ఇద్దరు సభ్యులు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. 

Flash...   ఈ కారు పై రూ. 1.10 లక్షల డిస్కౌంట్ - వివరాలు ఇవే

అప్రమత్తమైన గ్యాంగ్‌లు

వరుస చోరీలు చేసిన చెడ్డీగ్యాంగ్‌ ఫొటోలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. పత్రికల్లో గ్యాంగ్‌ ఫొటోలను చూసుకున్న తర్వాత కొద్దిరోజులపాటు విరామం ఇచ్చారు. పోలీసులు రెండు, మూడు రకాల ఆపరేషన్లు మొదలుపెట్టిన తర్వాత రెండు గ్యాంగ్‌లు అప్రమత్తమయ్యాయి. కేసులో దర్యాప్తు కొంత భాగం మాత్రమే పూర్తయిందని, ఇంకా అధికభాగం మిగిలే ఉందని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. సొత్తుతో పరారైన వ్యక్తులు చిక్కడానికి ఇంకా ఎన్నో రోజులు పట్టదని అభిప్రాయపడుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో చెడ్డీగ్యాంగ్‌ కథ మొత్తం ఓ కొలిక్కి వస్తుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.