50,000 EX-gratia: కరోనా బాధితకుటుంబాలకు అండగా ఏపీ ప్రభుత్వం..పరిహారం కోసం ఆన్‌లైన్ పోర్టల్..ఎలా అప్లై చేసుకోవాలంటే..
50,000 EX-gratia: రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థికంగానే కాదు.. ఒక తరం అంతరించిపోతుందా అనిపిస్తే.. భవిష్యత్ తరాలకు చదువు, అభివృద్ధి అనేది సుదూరం అనే విధంగా ప్రభావం చూపించింది. ఇక కరోనాబారిన పడి అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ముఖ్యంగా కుటుంబానికి ఆసరాగా నిలబడే అండను పోగొట్టుకుని ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కారణంగా మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఏపీ సర్కార్ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కరోనా బాధిత కుటుంబాలకు సులభంగా నష్టపరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రభుత్వం తెలిపింది. నష్టపరిహారం అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరిస్తున్నామని పేర్కొంది.
కరోనా బారిన పడి మరణించిన వ్యక్తుల వారసులు.. ఈ నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. దరఖాస్తుని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. బాధితులు నష్టపరిహారం కోసం http://covid19.ap.gov.in/exgratia ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.
అయితే నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసేవారు తప్పని సరిగా మృతులకు సంబంధించిన కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్ట్ (ఆర్‌టిపిసిఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్) డాక్యుమెంట్‌ను జతచేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వలన ఇప్పటి వరకూ 14,478 మంది మరణించినట్లు తెలుస్తోంది.