APలో PRC రగడకు పడని ఎండ్‌కార్డ్‌..!

 ఏపీలో పీఆర్సీ రగడకు పడని ఎండ్‌కార్డ్‌..!

ఏపీలో పీఆర్సీ రగడకు ఎందుకు ఎండ్‌కార్డ్‌ పడటం లేదు? ప్రభుత్వమా లేక ఉద్యోగ సంఘాల నాయకత్వం దీనికి కారణమా? సర్కార్‌కు కలిసి వస్తున్న అంశాలేంటి? JACలో గ్రూపు తగాదాలను చూసి ఆనందిస్తోంది ఎవరు?

రెండు వారాలుగా చర్చలు జరుగుతున్న పీఆర్సీపై వీడని పీటముడి..!

గల్లా పెట్టే గలగల లాడక ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. ఇదే టైమ్‌లో ఉద్యోగ సంఘాలు జీతాలు పెంచాలని రోడ్డెక్కాయి. సాధ్యమైనంత తక్కువగా ఫిట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసి ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేయడం కామన్‌. ఆ లెక్కలు డిమాండ్స్‌కు దగ్గరగా లేకపోతే ఉద్యోగ సంఘాలు ఒప్పుకోవు. తాజా ఎపిసోడ్‌లో రెండు వారాలకు పైగా పీఆర్సీ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అధికారులు, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలుమార్లు చర్చ నిర్వహించినా.. పీఆర్సీపై పీటముడి వీడలేదు. దీంతో అసలు సమస్యపై సచివాలయ వర్గాలు ఆసక్తిగా చెప్పుకొంటున్నాయి.

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో బయటపడ్డ గ్రూప్‌ ఫైట్‌..!

అంతా ఒక్కటై ఒకే గళం వినిపించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు ఎవరి అజెండా వాళ్లు అమలు చేస్తున్నారట. దీంతో మూడు ముక్కలాటలా మారింది సమస్య. బండి శ్రీనివాస రావు, బొప్పరాజు నేతృత్వంలోని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఒక గ్రూప్‌ కాగా, సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మరో గ్రూప్‌. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ దారి వేరు. ఒక బృందం లేవనెత్తే వాదనకు అధికారులు కౌంటర్‌ చేయకముందే.. పక్కనున్న మరో గ్రూప్‌ దానిని ఖండిస్తోంది. మొన్నటి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలోనూ అదే జరిగిందట.

ఉద్యోగ సంఘాల్లోనే అభిప్రాయ భేదాలు..!

బొప్పరాజు, బండి బ్యాచ్ ప్రభుత్వం చెబుతున్న 14 శాతం కాకుండా 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో లెక్కలేసి మరీ అధికారులు ముందు పెట్టారట. లెక్కలు వేయాలంటే ఉద్యోగుల కేడర్లు.. వివిధ శాఖల్లోని సర్వీస్‌ నిబంధనల సమగ్ర సమాచారం, మాస్టర్ స్కేల్స్‌ వంటి సంక్లిష్ట వ్యవహారాలు తెలిసి ఉండాలి. అధికారికంగా అడిగితేనే ప్రభుత్వం ఈ లెక్కలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు.. ఈ కాకి లెక్కలు ఎక్కడి నుంచి వేసుకొచ్చారు అని మండిపడ్డారట మరో నేత సూర్యనారాయణ. లెక్కలు వేసేపని ఉద్యోగ సంఘాలది కానప్పుడు అత్యుత్సాహం ఎందుకన్నది వారి వాదన. సీఎస్‌ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటి చేసిన ఫిట్‌మెంట్‌ క్యాలిక్యులేషనే తప్పని మరో నాయకుడు వెంకట్రామిరెడ్డి వాదించబోతే.. ప్రభుత్వం స్పష్టత ఇచ్చాకే స్పందించాలి కానీ.. తెలివి తేటల ప్రదర్శన ఎందుకని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విమర్శించిందట.

Flash...   SSC Public Exams 2022 Centers as No Phone Zones including the CS - Latest Instructions issued

ఉద్యోగ సంఘాల అనైక్యతే ప్రభుత్వానికి ప్లస్సా..!

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి విభాగాలు దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే సచివాలయ ఉద్యోగుల సంఘం వెంటనే ఎంట్రీ ఇస్తుందని టాక్‌. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకముందే ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించే పని చేస్తుంటారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామి రెడ్డిపై విరుచుకు పడుతుంటారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఉన్న ఈ అనైక్యతే ప్రభుత్వానికి ఊరట నిస్తోందట. మధ్యలో ఎంత ఆలస్యమైతే అంత మంచిదే అన్నట్టు ఆనంద పడుతున్నారట ఆర్ధిక శాఖ ఉద్యోగులు. మరి.. ఉద్యోగ సంఘాలు విడిపోయి.. వీకైన ఈ సమయంలో పీఆర్సీ పీటముడి ఎప్పుడు వీడుతుందో చూడాలి.