Complete Shutdown: ఒమిక్రాన్ లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాం: ప్రధాని

 ఒమిక్రాన్ లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాం: ప్రధాని: కంప్లీట్ షట్‌డౌన్: జనవరి 14 వరకూ అన్నీ బంద్. 

ఆమ్‌స్టర్‌డ్యామ్: ప్రపంచ దేశాలన్నీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దాని వెంటే కొత్త సంవత్సరాన్ని ఆనందోత్సాహాల మధ్య స్వాగతించడానికి సమాయాత్తమౌతున్నాయి. ఈ రెండింటికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయనేది తెలియనిది కాదు. వందలాది మంది ఒకే చోట గుమికూడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా చర్చ్‌లన్నీ భక్తులతో నిండిపోతుంటాయి. కోలాహలంగా మారుతుంటాయి. కొత్త సంవత్సరం వేడుకల్లోఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.

14వ తేదీ వరకు.. 

ఈ తరహా పరిస్థితులు కరోనా వైరస్, భయంకరమైన దాని కొత్త స్వరూపం ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందడానికి దారి తీస్తాయనడంలో సందేహాలు అక్కర్లేదు. దీన్ని నివారించడానికి మళ్లీ లాక్‌డౌన్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి తలెత్తింది. ఒక్కో దేశం క్రమంగా లాక్‌డౌన్‌లోకి జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నెదర్లాండ్స్.. లాక్‌డౌన్ ప్రకటించింది. కంప్లీట్ క్రిస్మస్ లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టింది. ఆదివారం నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది.

లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాం.. 

ఈ విషయాన్ని నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రుట్టె వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోండటం, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశ ప్రజలు సంసిద్ధమౌతున్న ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని, బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆదివారం నుంచి తామందరం లాక్‌డౌన్‌లోకి వెళ్లబోతున్నామని పేర్కొన్నారు.

పరిమితంగా.. 

ఎప్పట్లాగే అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరుకుల రవాణా, వాటికి సంబంధించిన దుకాణాలకు మినహాయింపునిచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ నెల 24, 25, 26 తేదీల్లో క్రిస్మస్ వేడుకల కోసం తమ ఇళ్లకు నలుగురు దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించుకోవచ్చని తెలిపింది. 13 సంవత్సరాలకు పైనున్న, 60 సంవత్సరాల లోపు వయస్సున్న వారిని మాత్రమే ఈ వేడుకల కోసం ఆహ్వానించాలని సూచించింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం ఈ సంఖ్యను రెండుకు కుదించింది.

Flash...   తత్కాల్ టికెట్లు.. ఎలా బుక్ చేయాలో తెలుసా..?

స్కూల్స్ క్లోజ్.. 

నిత్యావసర సరుకులను విక్రయించడానికి వారాంతపు రోజుల్లో ఏర్పాటు చేసే మార్కెట్లు, వైద్య సేవలు, ఇతర అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంత్యక్రియల్లో హాజరయ్యే వారి సంఖ్యను కూడా పరిమితం చేసింది. పాఠశాలలను జనవరి 9వ తేదీ వరకు మూసి ఉంచాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత పరిస్థితులను సమీక్షించిన తరువాత వాటిని తెరవడంపై ఆదేశాలను జారీ చేస్తామని పేర్కొంది.

యూరప్ దేశాల్లో రెస్టారెంట్లకు వెళ్లడంపైనా ఆంక్షలు ఉన్నాయి. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో పార్సిల్ సౌకర్యాన్ని మాత్రమే కొనసాగించింది. అక్కడే కూర్చుని భోంచేయడాన్ని నిషేధించింది నెదర్లాండ్స్ ప్రభుత్వం. కాగా- మిగిలిన యూరప్ దేశాలన్నీ ఇదే తరహాలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదు. క్రిస్మస్ లాక్‌డౌన్ ప్రకటించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామంటూ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇటీవలే స్పష్టం చేశారు. ఆ దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.

భారత్‌లోనూ.. 

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. 11 రాష్ట్రాల్లో తిష్ఠ వేసిందీ మహమ్మారి. 101 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. ఇప్పటిదాకా మరణాలు నమోదు కాకపోవడం కొంత ఊరటనిస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లతో పోల్చుకుంటే మూడున్నర రెట్లు వేగంతో విస్తరించే లక్షణాలు ఒమిక్రాన్‌కు ఉండటం పట్ల అన్ని దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తోన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే హెచ్చరికలను జారీ చేసింది. వ్యాక్సిన్ సైతం దీని మీద ప్రభావం చూపట్లేదంటూ నిపుణులు స్పష్టం చేస్తోన్నారు.