Investment in NPS: ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి మెరుగైన రాబడిని ఇస్తుందా?
ఇంటర్నెట్ డెస్క్: గత 12 ఏళ్లలో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో చందాదారులు సగటున 10-12% రాబడిని పొందారని పీఎఫ్ఆర్‌డీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇతర సూపర్ యాన్యుయేషన్ ఫండ్ల కంటే ఎన్‌పీఎస్‌పై రాబడులు చాలా మెరుగ్గా ఉన్నాయి. 2021లో ఎన్‌పీఎస్ కింద ప్రభుత్వ రంగ చందాదారులకు ఒక సంవత్సరం 12.6% రాబడి రాగా.. ఈపీఎఫ్‌వో కింద 8.5% మాత్రమే వడ్డీ వచ్చింది. బీమా కంపెనీలు నిర్వహించే సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ కింద 8% ఆదాయం వస్తుంది. ఎన్‌పీఎస్‌తో సమానంగా ఆదాయం పొందిన పథకాలు అయితే ఎంతో రిస్క్ ఉన్న ఈక్విటీ పథకాలు మాత్రమే. 12 సంవత్సరాల కాలంలో ఈక్విటీ పథకాల నుంచి రాబడి 12% కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు దాదాపు 10% రాబడి పొందాయి. కార్పొరేట్ బాండ్లు 9.6% సీఈజీఆర్‌ని చూశాయి. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో రూ.6.85 లక్షల కోట్ల మొత్తం కార్పస్ ఉంది. పీఎఫ్ఆర్‌డీఏ అంతర్గత అంచనా ప్రకారం ఎన్‌పీఎస్ కార్పస్ 2022 ఆర్థిక సంవత్సరం సంవత్సరం చివరి నాటికి రూ.7.6 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఇది దాదాపు 30% వార్షిక పెరుగుదల.
చదవండి : SBI 3 in 1 offer: SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, గెయిల్ (ఇండియా), పీఎఫ్‌సీ, వివిధ రైల్వే కంపెనీలు సహా 50 కంటే ఎక్కువ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ సంస్థలు గత కొన్ని ఏళ్లుగా ఎన్‌పీఎస్‌లో చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 4.24 కోట్లుగా ఉన్న ఎన్‌పీఎస్ చందాదారులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఒక కోటి మేర అదనంగా పెరగొచ్చని పీఎఫ్ఆర్‌డీఏ అంచనా. అంతేకాకుండా భారత్‌లో ఉన్న 38 కోట్ల అసంఘటిత కార్మికులకు, ఉద్యోగులకు విశ్వసనీయ రిటైర్మెంట్ బెన్‌ఫిట్ కవర్‌ను అందించే మిషన్‌ను ప్రారంభించాలని కేంద్రం పరిశీలిస్తోంది. ఒక వ్యక్తి పదవీ విరమణ తర్వాత అధిక మొత్తాన్ని పొందేందుకు ఎన్‌పీఎస్‌ను ముందుగానే ప్రారంభించాలని పెన్షన్ రెగ్యులేటర్ తెలిపారు. ఈ ఖాతాను ప్రారంభించడానికి కేవలం రూ.1,000 చెల్లించాలి. ఆ తర్వాత పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం నియమాల)కి లోబడి ఎంత మొత్తం అయినా చెల్లించొచ్చు.
చదవండి : SBI సరికొత్త డిపాజిట్ పథకం-అదనపు వడ్డీ లభిస్తుంది
ఎన్‌పీఎస్‌లో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అనేది వ్యక్తిగత చందాకు కనీస హామీ పెన్షన్ రూపంలో (రూ. 1,000 నుంచి రూ. 5,000) నెలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ మద్దతుగల స్వచ్చంధ పథకం. ఇది మార్కెట్ లింక్డ్ అయినప్పటికీ ఎన్‌పీఎస్ కింద 68% చందాదారుల బేస్ కలిగి ఉంది. మిగిలిన 32% కేంద్ర ప్రభుత్వ రంగం, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగ వ్యక్తుల నుంచి వినియోగదారులను కలిగి ఉంటుంది. ఎన్‌పీఎస్ నుంచి ప్రతి ఆర్ధిక సంవత్సరం పన్ను ప్రయోజనాలతో పాటు పెట్టుబడిదారులు.. వారి పదవీ విరమణ సంవత్సరాలలో పెన్షన్ పొందుతారు. పెన్షన్ స్కీమ్ నుంచి మెరుగైన ప్రయోజనాలను పొందాలంటే ఒక వ్యక్తి వీలైనంత త్వరగా పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలని పీఎఫ్ఆర్‌డీఏ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం పీఎఫ్ఆర్‌డీఏ.. రెండు ప్రధాన పెన్షన్ పథకాలను అందిస్తోంది. అవి ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్), ఏపీవై (అటల్ పెన్షన్ యోజన). భుత్వం, కార్పొరేట్ రంగం సహా సంఘటిత రంగ ఉద్యోగులకు ఈ పథకాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఏపీవై (అటల్ పెన్షన్ యోజన) అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి అనేక పన్ను ప్రయోజనాలకు కూడా అర్హమైనది.