ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకెర్ బర్గ్ ను దాదాపు ఒకే తరహా టీషర్ట్ జీన్స్ లోనే చూస్తూ ఉంటుంది ప్రపంచం. జుకెర్ బర్గ్ అనగానే.. టీషర్ట్, జీన్స్ లోని అతడి రూపమే మదిలో మెదులుతుంది. అరుదుగా మాత్రమే కనీసం సూట్ లో అయినా జుకర్ కనిపిస్తూ ఉంటాడు. అతి డ్రస్సింగ్ సిగ్నేచర్ స్టైల్ మాత్రం ఒక్కటే!
కేవలం జుకర్ మాత్రమే కాదు.. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సక్సెస్ ను సాధించిన పలువురు తరచూ ఒకే తరహా దుస్తుల్లో కనిపిస్తూ ఉంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రతన్ టాటా వంటి వాళ్లను సూట్ లోనో, నీట్ గా ఇన్ షర్ట్ చేసుకున్న తరహాలో తప్ప మరో రకంగా ఊహించడం కూడా కష్టం!
చదవండి : ఈ LIC పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్
ఈ విషయంలో అంతర్జాతీయ ప్రముఖులే కాదు.. లోకల్ గా కూడా కొన్ని ఉదాహరణలను ప్రస్తావించవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాకు ఎన్నికైన దగ్గర నుంచి దాదాపు ఒకే తరహా రంగు బట్టల్లోనే కనిపిస్తూ ఉంటారు. వైట్ షర్ట్, కాస్త గోధుమవర్ణంలోని ప్యాంట్ లో తప్ప మరో డ్రస్సింగ్ లో జగన్ ను చూడటం దాదాపు కష్టం.
అయితే ఈ తరహాకు కొందరు మాత్రం మినహాయింపు. వారిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉంటారు. బహుశా మోడీ కనిపించినన్ని రంగు దుస్తుల్లో కనిపించే పెద్ద స్థాయి వారు మరొకరు ఉండరు కాబోలు. రంగురంగు జాకెట్ లలో మోడీ కనిపిస్తూ ఉంటారు. విభిన్నమైన వస్త్రధారణలను అనుసరిస్తూ ఉంటారు. అది ఆయన ఆసక్తి.
ఇక ఒకే తరహా వస్త్రధారణకే ప్రాధాన్యతను ఇచ్చే సెలబ్రిటీలు, సక్సెస్ ఫుల్ పర్సన్స్ విషయానికి వస్తే.. ఆ తరహాను అనుసరించడంలో తమ ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు.. వారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ఉంటుందంటారు విశ్లేషకులు. వాళ్ల స్థాయికి ఎన్ని బట్టైలైనా, ఎన్ని స్టైళ్లలో అయినా కొనుక్కోగలరు. అయితే… ఒకసారి అన్ని కొనేశాకా.. వాటిల్లో ఏది ధరించాలో తేల్చుకోవడం అంత తేలిక కూడా కాదు. ఈ విషయంలో కష్టాలు ఎలా ఉంటాయో సామాన్యులకు కూడా తెలుసు.
ఉన్న కొన్ని బట్టల్లోనే సందర్భానికి తగ్గట్టుగా దేన్ని వేసుకోవాలో.. చాలా మంది వేరే వాళ్లను సలహాలు అడుగుతూ ఉంటారు. తమలో తాము తేల్చుకోలేకపోతూ ఉంటారు. మరి ఈ విషయంలో రోజంతా బిజీగా ఉండేవారు.. ప్రత్యేకంగా బట్టల గురించి ఆలోచించాలంటే అదో మానసిక ఒత్తిడిగా కూడా మారొచ్చు!
అందుకే సింపుల్ గా తమ సిగ్నేచర్ స్టైల్ ను ఒకదాన్ని క్రియేట్ చేసుకుని.. దాన్నే ఫాలో అవుతూ.. వీరు ప్రత్యేకంగా నిలవడంతో పాటు, డ్రస్సింగ్ గురించి వేరే ఆలోచన లేకుండా చేసుకుంటారు. నాయకత్వ స్థాయిల్లో ఉన్న వారు.. రకరకాల స్టైళ్లను ఫాలో కావడం కన్నా.. తమకంటూ ఒక స్టైల్ ను కలిగి ఉండటమే వారికి ప్రత్యేక గుర్తింపును కూడా ఇస్తుంది. దీంతో ఈ సింపుల్ అండ్ క్లాసిక్ స్టైల్ నే చాలా మంది ప్రముఖులు ఫాలో అవుతూ ఉంటారు.