వయస్సు 75 దాటితే.. పన్ను మినహాయింపు ఉంటుందా?
నా వయస్సు 76 సంవత్సరాలు. రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తోంది. సంస్థ యజమాని పన్ను రికవర్ చేసి, చెల్లించేశారు. నేను ఇక రిటర్న్ వేయాల్సిన అవసరం లేదా? – ఎం. నీలకంఠం, హైదరాబాద్
వయో వృద్ధులకు (75 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి) ఈ తరహా మినహాయింపునిచ్చే దిశగా 2021 బడ్జెట్‌లో సెక్షన్ 194పి పొందుపర్చారు. 1–4–2021 నుండి ఇది అమల్లోకి వచ్చింది. అంటే ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరం మొదలు.. (అసెస్‌మెంటు సంవత్సరం 2022–23) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. 2021 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వర్తించదు. దీన్ని పొందేందుకు కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి. ఆ విషయాన్ని వయో వృద్ధులు గమనించగలరు. ఇది ఎవరికి వర్తిస్తుందంటే..
READ: 2021- 22 కి మీ INCOMETAX ఎంతో ఇక్కడ తెలుసుకోండి
➧ ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది
➧ వారు కచ్చితంగా రెసిడెంట్ అయి ఉండాలి
➧ ఈ ఆర్థిక సంవత్సరంలో 75 సంవత్సరాలు పూర్తి అవ్వాలి (మొదలై, పూర్తి అవకపోవడం కాదు)
➧ వారి ఆదాయంలో రెండే రెండు అంశాలు ఉండాలి. పెన్షన్, నిర్దేశిత బ్యాంకు నుండి వడ్డీ
➧ ఏదేని కారణం వల్ల జీతం ఉంది అనుకోండి. ఈ మినహాయింపు వర్తించదు.
➧ ఇతరత్రా ఆదాయం, వ్యాపారం, వృత్తి, ఇంటి అద్దె, మూలధనం లాభాలు, డివిడెండ్లు .. ఇలా ఏ ఆదాయం ఉన్నా వర్తించదు బ్యాంకులకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.
ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే..
A) నిర్దేశిత బ్యాంకు .. అంటే బోర్డు నోటిఫై చేసిన బ్యాంకులకు రూలు 26డి ప్రకారం 12బీబీఏ ఫారం రూపంలో డిక్లరేషన్ ఇవ్వాలి
B) డిక్లరేషన్‌లో ఈ అంశాలు ఉండాలి. పేరు, పాన్ లేదా ఆధార్ వివరాలు, ఆర్థిక సంవత్సరం, పుట్టిన తేదీ, నిర్దేశిత బ్యాంకు బ్రాంచి వివరాలు, పెన్షన్ చెల్లిస్తున్న యజమాని వివరాలు, పెన్షన్ పేమెంట్ నంబరు
C) డిక్లరేషన్ తీసుకుని, ఆ నిర్దేశిత బ్యాంకు ట్యాక్సబుల్ ఇన్‌కం లెక్కించి, ట్యాక్స్‌ని నిర్ధారించి, పన్నుని డిడక్ట్ చేస్తుంది
D) ఈ ప్రహసనం సక్రమంగా పూర్తయితే, రిటర్ను దాఖలు చేయనవసరం లేదు.
ఇలాంటి ప్రయోజనం కల్పించేందుకు సంబంధిత సెక్షన్లలో కొన్ని మార్పులు చేశారు. అయితే, దీనివల్ల చాలా మందికి ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. పన్ను భారం తప్పదు. రిటర్ను వేసే బదులు ముందుగానే డిక్లరేషన్ ఇస్తే సదరు బ్యాంకు.. పన్ను చెల్లించి, ధృవీకరణ చేస్తారు. ఇదేం ఉపశమనం? ఆన్‌లైన్‌లో రిటర్న్ వేయడం తప్పుతుంది తప్ప ఇంకేమీ తప్పదు. కేవలం వడ్డీ ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుందా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఏదైతేనేం.. ఇది కేవలం కంటితుడుపు చర్యే కాని ఉపశమనం కాదు. నేతి బీరకాయలో నెయ్యిలాంటిది. అంతే!
– కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు)