పెరగనున్న మనిషి ఆయుష్షు… అప్పటిలోగా 180 ఏళ్లు బతుకుతారట.. వెలుగులోకి సంచలన నిజాలు
ప్రస్తుతం మనిషి ఆయుష్షు ఎంత అంటే.. 100 లోపే అని చెబుతాం. 60 ఏళ్లు దాటితే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. రోగాలు చుట్టుముడతాయి. 100 ఏళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ. కానీ.. ఇదంతా ఇప్పుడే.. కొన్ని ఏళ్ల తర్వాత మనుషులు 180 ఏళ్ల వరకు బతుకుతారు.. బతికి తీరుతారు అని శాస్త్రవేత్తలు చాలెంజ్ చేస్తున్నారు.
2100 సంవత్సరం లోపు మనుషుల ఆయుర్ధాయం పెరుగుతుందట. అది కూడా 180 ఏళ్లు అంటూ కెనడాకు చెందిన సైంటిస్టులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మాంట్రియల్‌లోని హెచ్ఈసీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మానవుడి ఆయుర్ధాయంపై చాలారోజుల నుంచి పరిశోధన చేస్తున్నారు. అత్యంత ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి రికార్డును 2100 సంవత్సరం లోపు బద్దలు కొట్టొచ్చని.. అసిస్టెంట్ ప్రొఫెసర్ లియో బెల్‌జిలె స్పష్టం చేశారు
ప్రస్తుతం అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా ఫ్రెంచ్‌కు చెందిన మహిళ రికార్డు సృష్టించింది. తను 122 ఏళ్లు జీవించి 1997లో కన్నుమూసింది. తన తర్వాత ఇంకెవ్వరూ 122 ఏళ్లు జీవించలేదు. కానీ.. త్వరలోనే ఆ రికార్డును బద్దలుకొట్టొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఒకవేళ మనిషి ఆయుర్ధాయం పెరిగితే.. దాని వల్ల ఈ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని.. మెడికల్ బిల్స్, హాస్పిటల్ ఖర్చులు లాంటి వాటి కోసం వృద్ధులు అయ్యాక ఎక్కువ ఖర్చుపెట్టాల్సి వస్తుందని మరో ప్రొఫెసర్ ఎలీన్ తెలిపారు.
ఆయుర్ధాయం మీద ఇప్పటి వరకు జరిగిన పరిశోధన ప్రకారం.. ఒక మనిషి 110 ఏళ్లు జీవిస్తాడనుకుంటే.. అందులో 50 ఏళ్లు పైబడగానే.. చనిపోయే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. 80 ఏళ్లు వచ్చాక చనిపోయే రిస్క్ తగ్గుతుంది. అలా.. 110 ఏళ్ల వరకు అదే రిస్క్ కొనసాగుతూ ఉంటుంది. 110 ఏళ్లు దాటాక మాత్రం మనిషి చనిపోయే ప్రమాదం ఒకేసారి 50 శాతం పెరుగుతుంది.