ఆంధ్రప్రదేశ్‌లో ఫిట్‌మెంట్, పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.. ప్రభుత్వ ప్రకటనతో భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.. దీనికోసం సోమవారం సీఎస్‌ను కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు.. అయితే, మరోవైపు.. ఉద్యోగులను బుజ్జగించే పనిలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇవాళ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. దీనిపై కీలకంగా చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. రెండున్నర గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరగగా.. ఫిట్‌మెంట్, పీఆర్సీపైనే ఎక్కువగా దృష్టిసారించినట్టుగా సమాచారం. ఇక, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం ఓ కమిటీని కూడా వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి రానున్నాయి. ఓవైపు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పడతామంటే.. ప్రభుత్వం కమిటీ వేసి చర్చలు జరపడానికి సిద్ధం అవుతోంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో.. గతంలో ఉన్న ఉద్యోగాల జీతాల కంటే.. ఇప్పుడు తగ్గిపోతున్నాయనే ఆందోళన నెలకొంది. దీనిపై కమిటీ సంప్రదింపులు జరపబోతోంది.