సార్, మేడం అనొద్దు; టీచర్ అని పిలిస్తే చాలు

 సార్, మేడం అనొద్దు; టీచర్ అని పిలిస్తే చాలు… కేరళలోని ఓ పాఠశాల ఆదేశాలు…

తిరువనంతపురం : కేరళలోని పాలక్కాడ్ జిల్లా, ఒలసెరి గ్రామంలో ఉన్న ఓ పాఠశాల స్త్రీ, పురుష సమానత్వం కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను మేడం, సార్ అని కాకుండా కేవలం టీచర్ అని మాత్రమే పిలవాలని విద్యార్థినీ, విద్యార్థులను ఆదేశించింది. ఓ సామాజిక కార్యకర్త స్ఫూర్తితో ఈ పాఠశాలలోని ఓ పురుష టీచర్ చొరవతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఒలసెరిలోని గవర్నమెంట్ ఎయిడెడ్ సీనియర్ బేసిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలన్ మీడియాతో మాట్లాడుతూ, సంజీవ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను ‘సార్’  అని సంబోధించడాన్ని వ్యతిరేకిస్తూ పాలక్కాడ్ జిల్లాలోని సామాజిక కార్యకర్త బోబన్ మట్టుమంత ప్రచారం చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో సంజీవ్ కుమార్ ఓ ప్రతిపాదన చేశారని తెలిపారు. పాఠశాలలో పని చేస్తున్న స్త్రీ, పురుష బోధనా సిబ్బందిని సార్, మేడమ్ అని పిలవడానికి బదులుగా అందరినీ ‘టీచర్’ అని పిలవాలని ప్రతిపాదించారన్నారు. అదేవిధంగా తమ పాఠశాలకు సమీపంలోని మత్తూరు పంచాయతీ కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకుందన్నారు. అధికారులను సార్, మేడమ్ అని పిలవడాన్ని నిషేధించిందన్నారు. వారి పదవి పేరుతో పిలవాలని ప్రజలకు తెలిపిందన్నారు. ఈ ప్రతిపాదనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించారని చెప్పారు. ఇప్పుడు విద్యార్థినీ, విద్యార్థులు తమకు పాఠాలు చెప్పేవారిని ‘టీచర్’ అని మాత్రమే పిలుస్తున్నారని తెలిపారు. 

బోబన్ మాట్లాడుతూ, సార్, మేడం అని పిలవడం స్త్రీ, పురుష సమానత్వ న్యాయానికి విరుద్ధమన్నారు. సార్ అనేది వలస పాలన కాలం నాటి అవశేషమని తెలిపారు. ఇటువంటి మార్పులు మిగిలిన పాఠశాలల్లో కూడా అమలు కావాలన్నారు.

Flash...   Google link for BYJUS Tabs Internet Router status