Airtel కు RBI శుభవార్త.. కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు ఇవే!

 ఎయిర్‌టెల్‌కు ఆర్‌బీఐ శుభవార్త.. కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు ఇవే!

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు గుడ్ న్యూస్ అందించింది. షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ ఇచ్చింది. దీంతో ఇకపై ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా షెడ్యూల్డ్ బ్యాంక్‌గా వ్యవహరించనుంది. దీని వల్ల కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగనుంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా రావడం వల్ల ఇకపై ఈ బ్యాంక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిజినెస్‌లలో పాల్గొనవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాల కస్టమర్లకు అందించొచ్చు. అంతే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందొచ్చు.

డిజిటల్ బ్యాంకింగ్‌లో వేగంగా ఎదుగుతున్న తమకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా లభించిందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. భారత్‌లో వేగంగా ఎదుగుతున్న డిజిటల్ బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా ఒకటి. ఈ బ్యాంక్‌కు 11.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ద్వారా పలు రకాల డిజిటల్ సేవలు అందిస్తోంది.

అలాగే బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా బ్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. బ్యాంక్ 2021 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో లాభాల బాట పట్టింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో అనుబ్రతా బిస్వాస్ మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను షెడ్యూల్డ్ బ్యాంక్ కేటగిరిలోకి చేర్చినందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు థ్యాంక్స్ చెప్పుకున్నారు. తన పెరుగుదలలో షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ అనేది చాలా కీలకమని తెలిపారు. బ్యాంక్‌పై కస్టమర్లు పెట్టుకున్న నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఇకపోతే కస్టమర్లు నిమిషాల్లోనే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. వీడియో కేవైసీ ద్వారా సులభంగానే 5 నిమిషాల్లో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అలాగే సేఫ్ అండ్ పే ద్వారా సురక్షితంగా లావాదేవీలు నిర్వహించొచ్చు. అలాగే రివార్డ్స్ 123 ప్రోగ్రామ్ కింద పలు రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. కాగా ఎయిర్‌టెల్ గత ఏడాది టారిఫ్ ధరలు పెంచేసిన విషయం తెలిసిందే. 25 శాతం వరకు రీచార్జ్ ధరలు పెరిగాయి. దీని వల్ల ఎయిర్‌టెల్ కస్టమర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇతర టెలికం కంపెనీలు కూడా ధరలు పెంచిన విషయం తెలిసిందే.

Flash...   టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు