08.01.2022: AP Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ ప్రచారం.! క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూపోతుండటంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ తరుణంలో కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలతో చెలరేగిపోతున్నారు.
కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభణ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చిందని.. థియేటర్లలో 50 శాతం మాత్రమే అక్యుపెన్సీ అంటూ పలు మెసేజ్‌లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
రాష్ట్రంలో ఎలాంటి నైట్ కర్ఫ్యూ లేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ చేసే వారి గురించి ఆరా తీస్తున్నామన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా, రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు తెలిపారు.