DDO లు, STO లకు ఆర్థికశాఖ హెచ్చరిక – క్రమశిక్షణ చర్యలు తప్పవు

 


క్రమశిక్షణ చర్యలు తప్పవు 

డీడీవోలు, ఎస్టీవోలకు ఆర్థికశాఖ హెచ్చరిక 

సాయంత్రం 6 గంటల వరకు డెడ్‌లైన్‌ 

రాష్ట్రాన్ని ఆర్థిక అంధకారంలోకి నెట్టి.. ఇప్పుడు మాపై చర్యలు తీసుకుంటారా? 

రావత్‌ మెమోపై ఉద్యోగుల మండిపాటు 

ఆ 2నెలల ఎరియర్లు ఎప్పుడిస్తారని ప్రశ్న

 అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కొత్త పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ హెచ్చరించారు. శనివారం సాయంత్రం 6గంటల్లోపు కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్‌ చేయాలని డెడ్‌లైన్‌ విధిస్తూ ఆయన ఉదయం ఒక మెమో జారీ చేశారు. డెడ్‌లైన్‌ లోపు తమ ఆదేశాలు పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీటీఏ, పీఏవో, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పేస్కేళ్ల ప్రకారం వేతనాలు ప్రాసెస్‌ చేయాలంటూ నాలుగు రోజుల నుంచీ రావత్‌ నిత్యం మెమోలు జారీచేస్తున్నా మెజారిటీ డీడీవోలు, ఎస్టీవోలు ఖాతరు చేయడం లేదు. శనివారం వరకు 30శాతం వేతనాల బిల్లులు కూడా ప్రాసెస్‌ కాలేదు. దీంతో శనివారం ఏకంగా తీవ్రమైన హెచ్చరికలతో కూడిన మెమోలను రావత్‌ జారీ చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడానికి తమకు మరింత సమయం కావాలని కొందరు ట్రెజరీ అధికారులు కోరారు.

ఉద్యోగులందరికీ కొత్తగా పే ఫిక్సేషన్‌ చేయడానికి వారందరి సర్వీసు రిజిస్టర్లు కావాలని, ప్రతీ కేడర్‌లో ఉద్యోగులకు స్కేళ్లు లెక్కించడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. పైగా కొత్త పీఆర్సీ ప్రకారం పే ఫిక్స్‌ చేయడానికి సాధారణంగా నెల రోజులు పడుతుందని, లేదంటే తప్పులు దొర్లుతాయంటున్నారు. అయితే సమయం కావాలని కోరుతున్న వీరి విజ్ఞప్తులను ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. మరోవైపు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ప్రాసెస్‌ చేయబోమని మరికొందరు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. 

జీతాలు కోసింది చాలక ఉద్యోగాలు పీకేస్తారా? పీఆర్సీ పేరుతో వేతనాలు భారీగా కోసింది చాలక ఇప్పుడు క్రమశిక్షణ చర్యల పేరుతో తమను సస్పెండ్‌ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. హక్కుల కోసం తాము ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పంతం నెగ్గించుకోవడానికి, క్రమశిక్షణ చర్యలు ప్రయోగించి మిగతా ఉద్యోగులను భయభ్రాంతులను చేయాలని చూస్తోందని విమర్శిస్తున్నారు. అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థిక అంధకారంలోకి నెట్టి ఇప్పుడు మాపై చర్యలు తీసుకుంటారా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో వేతనాలు అందకుండా చేస్తున్నారంటూ ఆ మెమోలో రావత్‌ పేర్కొనడాన్ని ఉద్యోగులు తప్పుబట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో 2నెలల పాటు తమకు 50 శాతం వేతనాలే ఇచ్చారని, ఎరియర్ల కోసం తాము హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందని ఉద్యోగులు గుర్తుచేశారువడ్డీతో సహా హైకోర్టు చెల్లించమంటే, ఆ ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అప్పుడు లేని కొవిడ్‌ ఇప్పుడే గుర్తొచ్చిందా అని విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఉద్యోగులకు వడ్డీతో సహా చెల్లించమని ఆదేశించినప్పటికీ ఇంకా ఆ 2నెలల ఎరియర్లు పెండింగ్‌లోనే ఉన్నాయని, దీనిపై ఏం సమాధానం చెబుతారని ఉద్యోగులు రావత్‌ని ప్రశ్నించారు. 

Flash...   AP లో FA3 / CBA2 పరీక్షల షెడ్యూల్ విడుదల.. 23 జనవరి 2024 నుంచి.. పరీక్ష విధానం ఇలా ..