గుడ్‌న్యూస్ : ఒమిక్రాన్ వేవ్ తర్వాత మహమ్మారి అంతం..కీలక అధ్యయనం వెల్లడి!
లండన్ : కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు కొనసాగినా మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఒమిక్రాన్ వేవ్ ముగిసిన తర్వాత కొవిడ్-19 తిరిగి వచ్చినా మహమ్మారి మాత్రం కనుమరుగవుతుందని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్ధలు, సమాజాలు ఎదుర్కొనే పునరావృత వ్యాధిగా కొవిడ్-19 మారుతుందని..అయితే సార్స్-కొవ్-2 కట్టడికి ప్రభుత్వం, సమాజం అసాధారణ చర్యలు తీసుకునే దశ ముగుస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్, ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ బలహీనమయ్యే కొద్దీ కొవిడ్-19 వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతుందని ముఖ్యంగా శీతాకాలంలో వైరస్‌ల వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. వైరస్ ప్రభావం మున్ముందు తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కొవిడ్-19 వైరస్‌ల వ్యాప్తి ఆరోగ్యంపై ప్రభావం పరిమితంగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది.
వైరస్‌ను గతంలో ఎదుర్కొన్న అనుభవం, నూతన యాంటీజెన్స్, వేరియంట్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టడం, యాంటీవైరల్ డ్రగ్స్ అందుబాటులోకి రావడం, వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలతో కొవిడ్-19 తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. ఒమిక్రాన్ వేవ్ ఇంకా తలెత్తని దేశాల్లో తాజా వేరియంట్ ముమ్మర దశకు చేరవచ్చని, ఈ స్ట్రెయిన్ కట్టడికి చేపట్టే నియంత్రణ చర్యలు ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోకపోవచ్చని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఒమిక్రాన్ నియంత్రణ కోసం నియంత్రణ వ్యూహాలను తిరిగి రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.