Health : మోతాదుకు మించి బాదం తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
బాదం డ్రై ఫ్రూట్స్ లో రారాజుగా చెప్పుకునే బాదం పప్పు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య, వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ దీనిని ఆహారంలో చేర్చుకోవాలని కూడా సూచిస్తుంటారు. బాదం పప్పు లో విటమిన్- ఇ పుష్కలంగా ఉంటుందని, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, ఇవి శరీరంతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. అదేవిధంగా బాదంపప్పును తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బాదంపప్పును తరచుగా తినేలా చేస్తుంటారు.
బాదంపప్పుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని మితంగానే తీసుకోవాలంటారు నిపుణులు. లేకపోతే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరి మోతాదుకు మించి బాదం పప్పులు తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం రండి.
ఇవి కూడా చదవండి
బెల్లం టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు…
బాదం పప్పులు ఎంత ఎక్కువగా తింటే అంత విటమిన్ ఇ శరీరానికి అందుతంది. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, బాదంపప్పులు ఎక్కువగా తీసుకుని శరీరంలో విటమిన్ ఇ 1000 ఎంజీలకు చేరితే విరేచనాలు, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తాయి.
ట్యాక్సిన్ల స్థాయులు పెరుగుతాయి..
బాదంపప్పును రోజూ తీసుకోవడం మంచిది, కానీ మోతాదుకు మించి తింటే, శరీరంలో విషతుల్య పదార్థాల స్థాయులు పెరిగే ప్రమాదం ఉంది. ఇది శ్వాసకోశ సమస్యలపైనా, నాడీ వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పగటిపూట 4 నుంచి 5 బాదంపప్పులు మాత్రమే తినాలని, అది కూడా నానబెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక బరువు..
బాదంపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వుల శాతం పెరుగుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వారు కనీస స్థాయిలో బాదంపప్పును తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మలబద్ధకం
బాదంపప్పు అధికంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మలబద్ధకం బాగా ఇబ్బంది పెడుతుంది. బాదం పప్పు జీర్ణం కావడానికి హైడ్రేటెడ్ గా ఎంతో అవసరం. అందుకోసం ఎక్కువగా నీళ్లు తాగాలి. ఒకవేళ తక్కువగా నీరు తాగుతూ ఉండి బాదం పప్పును ఎక్కువగా తీసుకుంటే మాత్రం జీర్ణ సంబంధిత సమస్యలు వేధించక మానవు.