Income Tax Abolish: ఇన్‌కమ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలి …. స్వామి సంచలనం
కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. కోట్ల మంది ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడి కింద నలిగిపోతున్నారు. కొవిడ్-19 జబ్బు ప్రభావంతో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఏకంగా ఇన్‌కమ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలంటున్నారు ఆయన.
READ: ఆదాయ పన్నుకు గుడ్‌బై చెప్పేసే సమయం వచ్చేసింది..
ఈ పరిస్థితుల్లో ఆదాయ పన్ను వసూళ్లను రద్దు చేయడం ఉత్తమం. అది కొన్నాళ్లపాటు!. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ నిర్ణయం ప్రకటించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుంది. పరిస్థితులు సర్దుకుని సాధారణ స్థితికి వచ్చే వరకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయకపోవడం మంచిదే అని ఓ జాతీయ మీడియా హౌజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు.
ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే మీరు ఏం చేసి ఉండేవారన్న ప్రశ్నకు.. మొదటగా పన్ను వసూళ్లను రద్దు చేస్తా. ఏప్రిల్ 1 నుంచి ఇది దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని ప్రకటిస్తా. పరిస్థితుల సాధారణం అయ్యేదాకా అది కొనసాగిస్తా. ఆపై దాన్ని శాశ్వతంగా కొనసాగించడం గురించి ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు. ఇక తన వాదనను సమర్థించుకునే క్రమంలో సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు
మార్గాలెన్నో..
బీజేపీ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నేను ఈ సలహా ఇచ్చా. ఆదాయపు పన్ను ద్వారా సుమారు 4 లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నాము. అదే బడ్జెట్ చూసుకుంటే దాదాపు 8-9 లక్షల కోట్ల మధ్య ఉంటోంది. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చు కదా అని చెప్పాను. ఉదాహరణకు.. 2జీ లైసెన్స్‌ల వేలం. మొదటి వేలంలో దాని ద్వారా ఎంత వచ్చిందో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఆదాయ పన్నుల వసూళ్లకి సమానం. పన్నులు పెంచే బదులు.. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందర ఎన్నో ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి గాడిన పడిందంటే.. ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారు. అలాగే, రీఇన్వెస్ట్ చేసిన కంపెనీల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని రూల్ పెడితే.. పొదుపు రేటు పెరుగుతుంది. ఆపై వృద్ధి రేటు కూడా పెరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోనుల మీద వడ్డీ రేటును తగ్గిస్తే (12 నుంచి 9 శాతానికి) మంచిదని, అది ప్రభుత్వం చేతుల్లో ఉందని, బ్యాంకులు కూడా చేసి తీరతాయని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 6 నుంచి 9 శాతానికి పెంచడం ద్వారా ప్రజలు సేవింగ్స్‌కు ముందుకొస్తారని పేర్కొన్నారు
మహమ్మారి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిడి కారణంగా జీడీపీ వాటా పరంగా గృహాల పొదుపు మొత్తం తగ్గిందని, పెట్టుబడులు కూడా తగ్గాయని స్వామి అంటున్నారు. ప్రపంచ మహమ్మారి విధ్వంసానికి ముందు 2019-20 నాలుగో త్రైమాసికంలో చూసిన వృద్ధి స్థాయిని ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తిరిగి పొందలేదని సుబ్రమణియన్ స్వామి గుర్తు చేస్తున్నారు. ఆర్థిక అంచనాలు, అధికారిక డేటా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి బలమైన వృద్ధిని సూచిస్తున్నప్పటికీ.. మిగిలిన త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుందని సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌టైంలో సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే గతంలోనూ ఆయన ఇలాంటి సలహాలే ఇచ్చారు కూడా!.