జీతాలపై డ్రామా
నెల చివర్లో తెరపైకి కొత్త సాఫ్ట్‌వేర్
శిక్షణ ఇవ్వకుండా ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి
తప్పులు వస్తే రికవరీ చేస్తామని హెచ్చరికఆదివారమూ పని..
అయినా నాలుగో వంతేకొత్త పీఆర్సీ అమలుకు హడావుడి
ప్రతి నెలా మాదిరిగా ఈసారీ ఆర్థిక కష్టాలు
కొత్త అప్పులకు కేంద్రంఅనుమతి నిరాకరణ
రేపు ఉద్యోగులందరికీ వేతనాలు డౌటే
ట్రెజరీ ఉద్యోగులపై నెపం వేసేందుకే ప్రభుత్వ డ్రామా అని ఉద్యోగుల మండిపాటు
అమరావతి-ఆంధ్రజ్యోతి*)ఏడాదిన్నర నుంచి ఏ నెలలో కూడా ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఒకటో తేదీన వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇవ్వలేకపోతోంది. డిసెంబరు జీతాలే ఇంకా రూ.1800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ట్రెజరీలో ప్రాసెస్ అయినా చెల్లించలేదు. అలాంటిది జనవరి జీతాల విషయంలో సర్కారు అత్యుత్సాహం చూపిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. బలవంతంగా కొత్త పీఆర్సీ అమలు కోసం వేతనాలు ప్రాసెస్ చేయాల్సిందేనని పట్టుబడుతోందని అంటున్నారు. పీఆర్సీపై సమ్మె నోటీసు నేపథ్యంలో పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే.. కొత్త పీఆర్సీ ప్రకారం అంటూ డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేయడం డ్రామా అని విమర్శిస్తున్నారు. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు దాని ప్రకారం ప్రతి ఉద్యోగికి వేతన స్కేలు నిర్ణయించడానికి దాదాపు నెల నుంచి నెలన్నర సమయం పడుతుందన్నారు. అయితే హడావుడిగా రెండు, మూడు రోజుల్లోనే పనంతా చేయాలని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం పాత జీతాలు ప్రాసెస్ చేసే సాఫ్ట్‌వేర్‌ను తొలగించి అకస్మాత్తుగా కొత్తగా ‘హెర్బ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టిందని, అందులో కొత్త జీతాలు ప్రాసెస్ చేయాలంటోందని ట్రెజరీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ హెర్బ్ సాఫ్ట్‌వేర్ గురించి తమకు కనీస అవగాహన లేదని, దీన్ని ఉపయోగించడంపై ప్రభుత్వం ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని తెలిపారు. శిక్షణ లేకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌పై కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ప్రాసెస్ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, ఇదంతా ప్రభుత్వానికీ తెలుసన్నారు. అయినా వేతనాల ప్రక్రియలో తప్పులు దొర్లితే బాధ్యత తమదేనంటూ ప్రభుత్వం జీవోలో పేర్కొందని వాపోయారు. తమ వేతనాల నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినెలా వేతనాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఆర్‌బీఐ నుంచి అప్పు తీసుకోవడమో లేదా ఓడీ రూపంలో అప్పు చేయడమో చేస్తోందని, ఈ నెల కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం కొత్త అప్పులకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నెల జీతాలు ఇవ్వడం మరింత కష్టమని భావిస్తున్నారు. సర్కారుకు ఇవన్నీ తెలిసినా.. డీడీఓ, ట్రెజరీ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే వేతనాలు అందలేదని చెప్పుకోవడానికే కొత్త సాఫ్ట్‌వేర్‌తో సరికొత్త డ్రామాకు తెరతీసిందని విమర్శించారు. జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి అంతశ్రద్ధ ఉంటే ఒకటో తేదీనే ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. అలాగే.. డిసెంబరు నెలకు సంబంధించిన జీతాలు రూ.1800 కోట్లు, ఉద్యోగుల దరఖాస్తు చేసుకున్న వివిధ రకాల అడ్వాన్సులు రూ.2000 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.300 కోట్లు, సరెండర్ లీవ్స్, ఈఎల్స్‌కు సంబంధించి రూ.650 కోట్ల బిల్లులు ప్రాసెసింగ్ అయ్యాయని, చెల్లింపులకు సిద్ధంగా ఉన్న ఆ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
నేటి సాయంత్రానికి 50 వేల మందికే ఈ నెల 31వ తేదీ సాయంత్రం నాటికి 50,000 మంది ఉద్యోగుల కంటే ఎక్కువమంది వేతనాల బిల్లులు ప్రాసెస్ చేయలేమని ట్రెజరీ అధికారులు చెప్పారు. కొత్త సాఫ్ట్‌వేర్‌పై కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులు చేయడం కొంత క్లిష్టంగా ఉందని, రోజుకు 25,000కు మించి బిల్లులు చేయలేకపోతున్నామని చెప్పారు. 30వ తేదీ ఆదివారం అయినప్పటికీ 25,000 బిల్లులు ప్రాసెస్ చేశామని, 31వ తేదీన గరిష్ఠంగా మరో 25,000 బిల్లులు ప్రాసెస్ చేయగలమన్నారు. ఉద్యోగులకు సంబంధించి వేతనాల బిల్లులు 4 లక్షలకు పైగా ఉన్నాయని చెప్పారు. పెన్షనర్ల బిల్లులను సీఎ్‌ఫఎంఎ్‌సలో ప్రభుత్వమే జనరేట్ చేసి వెరిఫికేషన్ కోసం తమకు పంపిస్తోందన్నారు. ప్రస్తుతం వార్డు సచివాలయ ఉద్యోగులు, కోర్టులు, పోలీసు శాఖ ఉద్యోగుల బిల్లుల తమ కార్యాలయాలకు వచ్చాయని ట్రెజరీ అధికారులు చెప్పారు. పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్పుల్లో తలెత్తిన తప్పులను సరిచేశామని, డీఏల తాలూకు ఎరియర్లు కలిపి వాటిని సరిచేశామని చెప్పారు.
నాలుగో వంతు లోపే రాష్ట్రవ్యాప్తంగా 16,735 డీడీవోలుండగా 3,405 మంది వేతనాల ప్రాసెస్ మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇందులో 559 మంది డీడీవోలు వేతనాల ప్రాసెస్ పూర్తి చేసి ట్రెజరీ కార్యాలయానికి పంపారు. 2015 ఆర్‌పీఎస్ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 4,13,030 ఉద్యోగులకు గాను 1,26,023 ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల ప్రాసెస్ మొదలైంది.
జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలన్నది ఉద్యోగుల డిమాం డ్. వారితో చర్చలంటూనే.. మరోవైపు కొత్త పీఆర్సీ ప్రకారమే అంటూ సర్కారు ముందుకెళ్తోంది. ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి మరి సెలవురోజు ఆదివారం కూడా పనిచేయించింది.
జీతాలు ప్రాసెస్ చేయడానికి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వకుండా సర్కారు అకస్మాత్తుగా కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకువచ్చింది. దీనిపై తమకు అవగాహన లేదని, 31 సాయంత్రానికి 50వేల కంటే ఎక్కువ మంది వేతనాలు ప్రాసెస్ చేయలేమని ట్రెజరీ ఉద్యోగులు చెబుతున్నారు. 2015 ఆర్‌పీఎస్ ప్రకారమే 4,13,030 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
ప్రతినెలా మాదిరిగా ఈ సారి కూడా సర్కారుకు ఆర్థిక కష్టాలు ఉండనే ఉన్నాయి. కొత్త అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అటు ఖజానాకు కాసుల కటకట.. ఇటు ప్రాసెస్ చేయడంలో ఆలస్యం.. వెరసి ఫిబ్రవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పడేది డౌటే. అన్ని విషయాలు తెలిసినా.. వేతనాలపై ఇదంతా సర్కారు వారి డ్రామా అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.