ఉద్యోగ సంఘాలది వాట్సాప్ ఉద్యమం: అశోక్ బాబు
అమరావతి: ఉద్యోగ సంఘాల నాయకులు వాట్సాప్ ఉద్యమం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల నాయకులు అక్క బావా కబుర్లు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఇచ్చింది పీఆర్సీ కాదు….పే రివర్స్ అని చెప్తూనే ఉన్నామన్నారు.పీఆర్సీ 23 శాతం ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పినప్పుడే ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు రావాల్సిందన్నారు. ఈ ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మోసం చేసినట్లు మరే ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేయదన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం సీపీఎస్ సాధిస్తామని స్లొగన్స్ ఇచ్చిన నాయకులు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగస్తులు అంటే లెక్కలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు యుద్ధం అయినా చేయాలి లేక పదవులకు రాజీనామా చేయాలని అశోక్ బాబు అన్నారు.