కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ఎలా?

 ♦ కొత్త జిల్లాలకు  ఉద్యోగుల సర్దుబాటు ఎలా?

♦ కసరత్తు ప్రారంభించిన కలెక్టర్లు

 ♦ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వం సమీక్ష

🌻ప్రజాశక్తి – అమరావతి బ్యూరో

ఉగాది నాటికి నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామన్న ప్రభుత్వం కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ఎలా అనే అంశంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉద్యోగుల సర్దుబాటుపై జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. ఫిబ్రవరి మొదటి వారంలో సిఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్డెలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 51 రెవెన్యూ డివిజన్లు ఉండగా, తాజా నిర్ణయంతో మరో 13 రెవెన్యూ డివిజన్లు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాలకు సిబ్బంది నియామకం చేపట్టాలా లేక ఉన్న జిల్లాల అధికారులనే కొత్త జిల్లాలకు ఇన్ఛార్జులుగా నియమించి పాలన మొదలు పెట్టాలా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలో సరిపడా అధికారులు ఉన్నారా? లేక సిబ్బంది తక్కువగా ఉన్నారా? మండలాల్లో ఏయే శాఖల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారనే విషయంపై లెక్కలు తీయాలని ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనలో కీలకమైన ఐఎఎస్, ఐపిఎస్ లు ఇంకెంత మంది కావాలనే అంశంతో పాటు అవసరమైన మేర ఉన్నతాధికారులను తమ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పటికి ఉన్న స్ట్రక్చర్లో ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఐఎఎస్ అధికారు కొనసాగుతుండగా, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్ఫేర్. ఆసరా. రెవెన్యూ, వార్డు సచివాలయాలు, హౌసింగ్ నిర్మాణాలు పర్యవేక్షణ కోసం మరో ఇద్దరు జుయింట్ కలెక్టర్లను నియమించింది. 

వీరిలో కొందరు ఐఎఎస్ అధికారులుండగా మరికొన్నిచోట్ల ఎపిపిఎస్సి ద్వారా నియమితులైన గ్రూపు-1 అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు. రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఇప్పుడు అమలవుతున్న విధానంలాగా ముగ్గురు జాయింట్ కలెక్టర్లు కొత్త జిల్లాలకు కేటాయిస్తారా? లేక జిల్లా: విస్తీర్ణం తగ్గుతున్న దృష్ట్యా కలెక్టరు. ఒక జాయింట్ కరెక్టరుతో సరిపెడతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. నూతన జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది. నియామకాలతో పాటు కొత్త కార్యాలయ భవనాలు ఏర్పాటుకు సంబంధించి కమిటీలు నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కమిటీలు గతంలో కొంత కసరత్తు ప్రారంభించి పలు ప్రాంతాల్లో భవనాల కొరత మరికొన్ని ప్రాంతాల్లో ఇతర శాఖలకు చెందిన భవనాల సర్దుబాటుకు సంబంధించి కొంతమేర కసరత్తు చేశాయి. జనగణన సర్వే కాకుండా భౌగోళిక విస్తీర్ణం విడగొట్టకూడదని గెజిట్ ఇవ్వడంతో ఈ అంశాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. నూతన జిల్లాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఆయా కమిటీలు తిరిగి వారికి కేటాయించిన పనులు మొదలు పెట్టనున్నాయి.

Flash...   Personality Development:: మీ పిల్లల వ్యక్తిత్వాన్ని దృఢంగా మార్చేందుకు ఈ ఉపాయాలను ఉపయోగించండి.