ఫిబ్రవరి రెండో వారం వరకు స్కూళ్లు మూసేయాలి

 Nadendla Manohar : ఫిబ్రవరి రెండో వారం వరకు స్కూళ్లు మూసేయాలి – నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : ఏపీలో విద్యాసంస్థలకు సెలవుల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పుపట్టారు. ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయని, పిల్లలు కరోనా బారిన పడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల క్షేమం దృష్ట్యా ఫిబ్రవరి రెండో వారం వరకు రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాదెండ్ల మనోహర్. ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తుంటే స్కూళ్లు నిర్వహిస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు.

కరోనా కేసులు పెరిగితే విద్యాసంస్థల మూసివేత గురించి ఆలోచిద్దామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చేసిన వ్యాఖ్యలపై నాదెండ్ల స్పందించారు. మంత్రి ఆ వ్యాఖ్యలు చేసిన రోజున 4వేల కరోనా కేసులుంటే, ఇవాళ 14 వేల కేసులు వచ్చాయని చెప్పారు. మరి కేసులు పెరిగినట్టు కాదా విద్యాశాఖ మంత్రిగారూ? అని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని కేసులు పెరగాలి? ఎన్ని లక్షల యాక్టివ్ కేసులు ఉండాలి? అని నిలదీశారు.

“రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే పాఠశాలలకు పిల్లలను పంపించడం లేదు. కొన్ని స్కూళ్లలో తరగతికి ఒకరిద్దరు విద్యార్థులే ఉంటున్నారని మా దృష్టికి వచ్చింది. కరోనా బారినపడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. తమ బిడ్డలు ఎక్కడ కరోనా బారినపడతారో అని తల్లిదండ్రులు పడుతున్న ఆందోళనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఫిబ్రవరి రెండో వారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి. తద్వారా చిన్నారులను కరోనా నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది.

మహారాష్ట్రలో స్కూళ్లు తెరుస్తామంటే 60శాతం మంది తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఫీవర్ సర్వేలో, ప్రతి నలుగురిలో ఒకరు కరోనాతో బాధపడుతున్నారని వెల్లడైంది. వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతుండడంతో వైద్య సేవలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని కరోనా టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలి” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Flash...   EMPLOYEES ATTENDANCE: FACE RECOGNITION APP: అన్ని ప్రభుత్వకార్యాలయ్యాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్సు

ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు భారీగా సంఖ్యలో వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14వేల 440 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు కోవిడ్ తో

చనిపోయారు. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. మరోవైపు 369 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 46వేల 650 కరోనా టెస్టులు చేశారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 2వేల 258, అనంతపురం జిల్లాలో 1,534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 300 కంటే అధికంగానే కేసులు వెలుగుచూశాయి.

జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 1,534, చిత్తూరు జిల్లాలో 1,198, తూర్పుగోదావరి జిల్లాలో 1,012, గుంటూరు జిల్లాలో 1,458, కడప జిల్లాలో 788, కృష్ణా జిల్లాలో 304, కర్నూలు జిల్లాలో 1,238, నెల్లూరు జిల్లాలో 1,103, ప్రకాశం జిల్లాలో 1,399, శ్రీకాకుళం జిల్లాలో 921, విశాఖపట్నం జిల్లాలో 2,258, విజయనగరం జిల్లాలో 614, పశ్చిమ గోదావరి జిల్లాలో 613 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 21,80,634 పాజిటివ్ కేసులు నమోదు కాగా… వీరిలో 20,82,482 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3వేల 969 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ సంఖ్య 83,610కి పెరిగింది.