chalo vijayawada: ఇంతమంది ఉద్యోగులు ఎలా వచ్చారని జగన్‌ ప్రశ్న

 సీనియర్‌ ఐపీఎస్‌లపై జగన్‌ అసహనం 

ఇంతమంది ఉద్యోగులు ఎలా వచ్చారని ప్రశ్న

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమం సక్సెస్‌ కావడంతో పోలీసు, నిఘా వర్గాల ఉన్నతాధికారులపై సీఎం జగన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 15రోజులు ముందుగా ఉద్యోగులు ప్రకటన చేసి బెజవాడకు రాగలిగారంటే ఇది పూర్తిగా మీ వైఫల్యమే అంటూ సీనియర్‌ ఐపీఎ్‌సలకు తలంటినట్లు సమాచారం. హిందూపురం ఉద్యోగులు బెంగుళూరులో, కర్నూలు వాళ్లు బళ్లారిలో రైళ్లు ఎక్కి వస్తుంటే గుర్తించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉందా… అంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రైల్వేస్టేషన్లలో కాకుండా ఊరి బయట చైన్‌ లాగి ఎక్కడం, బెజవాడ చేరుకున్న తర్వాతా ఇదే విధానాన్ని అవలంబించి విజయం సాధించిన ఉద్యోగుల వ్యూహం సీఎంకు తీవ్ర అసహనం తెప్పించినట్లు తెలిసింది. ఉద్యోగులకు చాలాచోట్ల పోలీసులే సహకరించారని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంవో ఉన్నతాధికారి ఒకరు ప్రస్తావించగా, ‘కానిస్టేబుళ్లందరినీ ఇంటికి పంపాలా?’ అని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎదురు ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. 


పోలీసులకూ ద్రోహమే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రశ్నించే గొంతుకలను తమ ద్వారా అణచివేస్తున్న వైసీపీ సర్కారు తమకు కూడా ద్రోహం చేసిందని క్షేత్రస్థాయిలో పోలీసులు బలంగా భావిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో కుటుంబాలను సైతం వదిలి రోడ్లపై పనిచేసినా పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏ మాట అటుంచి, జిల్లా కేంద్రంలో పనిచేసే వారికి అలవెన్స్‌లు కూడా తగ్గించడమేంటని ప్రశ్నిస్తున్నారు. వీక్లీ ఆఫ్‌లపై జగన్‌ చేసుకున్నంత ప్రచారం దేశంలో ఏ సీఎం చేసుకోలేదని, ఒక్క జిల్లాలో అయినా వారాంతపు సెలవులు పోలీసులకు ఇస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి లీవుల సరెండర్‌, టీఏలు, డీఏలు అన్నింటా అన్యాయమే జరుగుతోందంటున్నారు. పోలీసు శాఖలో 20వేల ఖాళీల గురించి మూడేళ్లుగా సీఎం చెబుతూనే ఉన్నా నోటిఫికేషన్‌ మాత్రం వెలువడలేదంటున్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులను అడ్డుకోవడానికి వారేమైనా సంఘ విద్రోహ శక్తులా అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ సమాచారం సీఎంవోకు చేరడంతో పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి జగన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

Flash...   AP NEW CABINET: ఆ మంత్రులు సైతం ఔట్ - కొనసాగేది వీరే : కొత్త స్పీకర్ ఖరారు..!!