PRC NEWS: అటు కత్తులు.. ఇటు చర్చలు

 


అటు కత్తులు.. ఇటు చర్చలు

ఉద్యోగులపై సర్కారు పైఎత్తులు

సమ్మెబాట వీడాలని ఓవైపు చర్చల బాట

సమ్మె అణచివేతకు మరోవైపు యుద్ధ సన్నాహం

ఎస్మా ప్రయోగిస్తే పరిణామాలపై తర్జనభర్జన

‘చలో’ షాక్‌తో ప్రత్యామ్నాయాల వైపు..

సమ్మె జరిగితే బండి నడవడంపై ఆరా

వైద్యసేవలు ఎలా చేయాలని మీమాంస

సీఎం సమక్షంలో తీవ్రంగా కసరత్తు

సమ్మె చేస్తే క్రమశిక్షణ చర్యలు: సజ్జల

అర్ధరాత్రి దాటేదాకా తేలని చర్చలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అటు కత్తులు..ఇటు చర్చలు! ఉద్యోగుల ‘చలో విజయవాడ’ ఇచ్చిన షాక్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి అలాంటి ‘చాన్స్‌’ ఇవ్వకూడదనే పట్టుదల ప్రదర్శిస్తోంది. పీఆర్సీ సాధన కోసం ప్రకటించిన సమ్మెవరకు ఉద్యోగులను రానివ్వకూడదని భావిస్తోంది. ఒకవేళ సమ్మే అనివార్యమైతే ఏం చేయాలనేదానిపై ఇప్పటికే పక్కా వ్యూహం సిద్ధం చేసుకుంది. ఎత్తుకు పై ఎత్తులతో సన్నద్ధమవుతోంది. దీనికోసం  అన్నిరకాల ప్రత్యామ్నాయాలను ఆలోచించి పెట్టుకుంది. ఉద్యోగులపై కఠినమైన ఎస్మా ప్రయోగించేందుకూ రంగం సిద్ధం చేసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా  తెలుస్తున్న సమాచారం. సమ్మెతో వైద్యం, రవాణా, విద్యుత్‌ వంటి ముఖ్యమైన రంగాలకు బ్రేక్‌పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. పరిపాలన బండి కుంటుపడకుండా తీసుకోవాల్సిన ఎమర్జెన్సీ చర్యలపై కలెక్టర్లకు ఇప్పటికే సీఎస్‌ సమీర్‌శర్మ నిర్దేశాలు జారీ చేశారు. సమ్మెకు సిద్ధమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాహాటంగానే బెదిరిస్తున్నారు. ఇలా సమ్మెను ఎదుర్కొనేందుకు ‘యుద్ధ’ సన్నాహాలను సర్కారు దాదాపుగా పూర్తిచేసేసింది. మరోవైపు సమ్మెబాట నుంచి తప్పించే ఎత్తుగడతోనే అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు సాగిస్తోందని ఉద్యోగ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో చర్చల్లో ఉన్న నేతలకు ‘తగ్గేదే’ లే అంటూ స్మార్ట్‌ ఫోన్ల నుంచి కొందరు ఉద్యోగులు మెసే్‌సలు పెడుతుండటం విశేషం! ఇలా దూకుడుపై ఉన్న ఉద్యోగులను ‘ఎస్మా’ ప్రయోగిస్తేనే కట్టడి చేయగలమని అధికారులు… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఉద్యోగులు దారికి రావడం లేదని, విజయవాడ సభతో మరింత ఊపుతో స్పందిస్తున్నారని సీఎంకు నివేదించినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు సీనియర్‌ మంత్రులు, అధికారులతో సీఎం జరిపిన భేటీలో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. గురువారం నాటి పరిణామాలు, శుక్రవారం సచివాలయంలో ఉద్యోగుల పెన్‌డౌన్‌ వంటి ఆందోళనలపై చర్చ జరిగినట్లు తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఏం చేయాలి… ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటన్న అంశాలపై సీఎం చర్చించినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో సమ్మె అనివార్యమైతే దాన్ని ఎదుర్కొనేందుకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు పరిస్థితిని అదుపు తప్పనివ్వకుండా ఎస్మాను ప్రయోగించాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం అత్యంత రహస్యంగా ఎస్మా ప్రయోగానికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. శుక్ర వారం రాత్రి పొద్దుపోయేవరకు సీఎం ఈ ప్రతిపాదనకు  ఆమోదం తెలపలేదని తెలిసింది. ఇప్పటికిప్పుడే ఎస్మా ప్రయోగించవద్దన్న ధోరణిలోనే ఆయన ఆ ఫైలుకు ఆమోదం తెలపలేదని తెలిసింది. ఎస్మాను ప్రయోగిస్తే ఉద్యోగుల ఉద్యమం ఏ స్థాయికయినా వెళ్లిపోతుందని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, శుక్రవారం సాయంత్రం మంత్రుల కమిటీతో ఉద్యోగులు జరిపిన చర్చలు ఆశాజనకంగా లేవన్న అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీంతో మరోసారి ఎస్మాపైనే తర్జనభర్జనలు మొదలైనట్లు తెలిసింది. ఎస్మా ప్రయోగిస్తే ఉద్యోగులు భయపడిపోతారని, అవసరమయితే అరెస్టులు చేయవచ్చని, బెయిలు కూడా రాదని, ఈ విధంగా చేస్తే ఉద్యోగవర్గాల్లో కలవరం రేగుతుందని అధికారవర్గాలు చెబుతున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయంపై అంతిమంగా ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాఽథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ , ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Flash...   RAINS IN AP - మరో పిడుగులాంటి వార్త .. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మరిన్ని వర్షాలు

ఏం చేద్దాం..?

ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు సిద్ధమైతే మొదటిగా ఆ ప్రభావం పడే రంగాలు వైద్యం, రవాణా, విద్యుత్‌, పోలీసు. సీఎం వద్ద జరిగిన సమీక్షలో పీఆర్సీ ఉద్యమంతో ఈ రంగాలపై పడే ఒత్తిడి గురించే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు వెళ్తే ప్రజారవాణాకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని సమావేశం భావించింది. అయితే.. కార్మికుల్లో 30,000 మంది తాము సమ్మెకు దూరంగా ఉంటున్నామని ప్రకటించడం.. అద్దెబస్సులు అందుబాటులో ఉండటంతో ఉన్నవారితోనే ప్రజారవాణాను నడిపించాలని యోచించారు. సమ్మె కారణంగా ప్రభుత్వ వైద్యసేవలు కుంటుపడరాదని సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా సమయంలో భారీగా నియమించిన కాంట్రాక్టు ఉద్యోగులతో ఆస్పత్రులను నడిపించవచ్చునని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల సేవలనూ అందుకోవచ్చునని సమావేశం అభిప్రాయపడింది. కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినా పెద్దగా సమస్యలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటికీ ప్రజా సేవలకు అంతరాయం ఏర్పడితే .. ఎస్మా ప్రయోగించడంపై దృష్టి సారిద్దామన్న అభిప్రాయం వ్యక్తమైంది. 

సమ్మెకు వెళ్తే ఉద్యోగులపై చర్యలు: సజ్జల

ఉద్యోగులు సమ్మెకు వెళ్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పీఆర్‌సీ నుంచి ఎక్కువ ఆశించడం వల్లే సమస్య పరిష్కారం కావడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం వద్ద సమీక్ష అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అయితే.. సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం వారికి లేదనిపించింది. బలప్రదర్శన చేయడం ద్వారా సమస్య జటిలమవుతుంది. వరుస చర్చల సందర్భంలో పరిస్థితిని వివరించినా అర్థం చేసుకోవడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మంచి ప్యాకేజీనే ఇచ్చాం. ఐఆర్‌ కంటే (27 శాతం) ఎక్కువ చేయాలని ఉన్నా సంక్షేమ పథకాల వల్ల చేయలేదు. సంక్షేమానికి దోచిపెడుతున్నామనడంలో అర్థం లేదు. సమ్మె కాలంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే. సమ్మెకు వెళ్తే ఉద్యోగులపై క్రమశిక్షణ ఖాయం’’ అని స్పష్టం చేశారు. 

Flash...   ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్‌ నవంబర్ 30 వరకు అవకాశం

ఎస్మా ప్రయోగిస్తే…?

ఉద్యోగుల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తే వ్యవహారం మరింత కఠినంగా మారుతుంది. ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు జనరల్‌, స్పెషల్‌ ఆర్డర్‌ ద్వారా సమ్మెలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చు.  అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వైద్యం, విద్యుత్‌, రవాణా, పోలీసు వంటి సర్వీసుల్లో సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి ఉత్తర్వులు ఇస్తుంటుంది. అయితే, ఇప్పుడు ఆ శాఖల ఉద్యోగులే కాకుండా అన్ని  ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నారు. ఎస్మా ప్రయోగిస్తే సమ్మెకు వెళ్లిన, సహకరించిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టవచ్చు.  సమ్మెచేస్తున్న వారితోపాటు వారికి సహకరించిన వారినీ శిక్షించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. వారంట్‌ లేకుండా అరెస్టు చేసే అధికారం సంక్రమిస్తుంది. 1971లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించినప్పుడు ఈ చట్టం కింద ఉద్యోగులను తొక్కిపెట్టారు.