PRC NEWS: జీతం రికవరీని తీవ్రంగా పరిగణిస్తాం

జీతం రికవరీని తీవ్రంగా పరిగణిస్తాం

ప్రభుత్వానికి స్పష్టంచేసిన హైకోర్టు

జీవోలన్నీ పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశం


ఈనాడు, అమరావతి: పీఆర్సీ అమల్లో భాగంగా ఏ ఉద్యోగి నుంచైనా జీతం రికవరీ చేసినట్లు తేలితే తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. ‘అశుతోష్‌ మిశ్ర ఇచ్చిన పీఆర్సీ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు? గోప్యత ఎందుకు పాటిస్తున్నారు? నివేదికను ఉద్యోగులకు ఇవ్వాలి కదా? న్యాయస్థానానికి మాత్రమే ఇస్తామనేందుకు మీకున్న ప్రత్యేక అధికారం ఏంటి?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

పీఆర్సీ విషయంలో జారీచేసిన జీవోలన్నీ పిటిషనర్‌/ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్యకు అందజేయాలని ఆదేశించింది. కౌంటరుతో పాటు అశుతోష్‌ మిశ్ర కమిషన్‌ నివేదికను కోర్టులో దాఖలు చేయాలని తేల్చిచెప్పింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ (వేతన సవరణ) ఉత్తర్వులను (జీవో 1) సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పీఆర్సీ ఉత్తర్వుల ఆధారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచీ రికవరీలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటరు వేయలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం రికవరీ చేయనున్నట్లు తెలుస్తోందన్నారు. పీఆర్సీ నివేదికను, తాజాగా జారీచేసిన జీవోలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ను వివరణ కోరింది. ఏజీ బదులిస్తూ.. జీతం నుంచి రికవరీ చేయడం లేదన్నారు. పీఆర్సీ నివేదికను మాత్రం కోర్టుకు అందజేస్తామన్నారు. పరిశీలన అనంతరం పిటిషనర్‌కు ఇవ్వడంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. జీవోలను పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. కౌంటరుతో పాటు పీఆర్సీ నివేదికను కోర్టులో దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

Flash...   Nehru Edwina: రహస్యంగానే నెహ్రూ-ఎడ్వినా లేఖలు