PROMOTIONS : 30 వేల మంది టీచర్లకు.. త్వరలో ప్రమోషన్‌…ఎంఈవోలకు అధికారాలు, పోస్టుల భర్తీ

 


30 వేల మంది టీచర్లకు.. త్వరలో ప్రమోషన్‌

పాఠశాల విద్యపై సమీక్షలో ఉపాధ్యాయులకు సీఎం జగన్‌ శుభవార్త 

ఎస్‌జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ చాన్స్‌

నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూళ్లతో అవకాశం

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం

సబ్జెక్టుల వారీగా కూడా అందుబాటులోకి ఉపాధ్యాయులు

జూన్‌ నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి 

ప్రతి మండలంలో రెండు పాఠశాలలు ఇక కళాశాలలుగా మార్పు

ఒకటి కో–ఎడ్యుకేషన్‌.. మరొకటి పూర్తిగా బాలికల కోసమే

టీచర్లకు బోధనేతర పనులు అప్పగించరాదని సీఎం ఆదేశం

విద్యా సంస్కరణలు, ఎస్‌సీఈఆర్టీ సిఫార్సులన్నీ అమల్లోకి 

సాక్షి, అమరావతి: విద్యాసంవత్సరం (జూన్‌) ఆరంభమయ్యే నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని, సబ్జెక్టుల వారీగా కూడా ఉపాధ్యాయులు ఉండాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఇప్పటివరకు 19 వేల స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తైంది. దీంతో వీటిల్లో 22 వేల మందికిపైగా టీచర్లకు ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ దక్కనుంది.

ఇక మ్యాపింగ్‌ కాని మరో 17 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకాలు, రేషనలైజేషన్‌ ద్వారా మరో 8 వేల మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇలా మొత్తం 30 వేల మంది ఉపాధ్యాయులకు జూన్‌ నాటికి ఎస్‌ఏలుగా పదోన్నతులు లభించనున్నాయి. వీరందరికీ ఎస్‌జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమోషన్లు, బదిలీలు తదితరాలన్నీ పూర్తి చేసి జూన్‌ నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్య, నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

ఎంఈవోలకు అధికారాలు, పోస్టుల భర్తీ

Flash...   Election remuneration to the poling staff of GP

రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌ఈఆర్‌టీ) సిఫార్సులన్నీ అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. మండల రిసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు అనుమతించారు. ఇకపై విద్యా సంబంధిత కార్యకలాపాలను ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు. ఎంఈవో పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు కల్పించనున్నట్లు తెలిపారు. 

ఆన్‌లైన్‌ అటెండెన్స్, మార్కులు..

పలురకాల యాప్స్‌ కన్నా రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తేవాలని సీఎం సూచించారు. అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్నారు. విద్యార్ధుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్న సిఫార్సును కూడా అమలు చేయాలని ఆదేశించారు.

 టీచర్లకు బోధనేతర పనులు వద్దు

పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సులను అమలు చేయాలని, హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయం కోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపారు. 

ఫిర్యాదులపై తక్షణ స్పందన

స్కూళ్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. సదుపాయాల లేమి, మౌలిక వసతులు, మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే స్పందించాలని నిర్దేశించారు. నాడు – నేడు ద్వారా కల్పించిన సదుపాయాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అప్రమత్తం కావాలని, స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. 

14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ 

జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తెలియచేసేందుకు ఏర్పాటు చేసిన 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ సమర్థవంతంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 

పది రోజుల్లో రెండో విడత 

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు –నేడు రెండో విడత పనులపై ముఖ్యమంత్రి జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలు పెట్టి సెప్టెంబరు కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Flash...   రోజూ మధ్యాహ్నం నిద్ర అలవాటు ఉందా..? అయితే, ఈ విషయం తెలుసుకోండి.!

రోజూ ఒక కొత్త పదం

స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలని, రోజూ ఒక కొత్త పదాన్ని పిల్లలకు నేర్పాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేర్పాలని, పాఠ్యప్రణాళికలో దీన్ని భాగం చేయాలన్నారు. 8, 9, 10వ తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ అందుబాటులోకి తీసుకొచ్చి ఒక సబ్జెక్టుగా బోధించటాన్ని పరిశీలించాలని సూచన చేశారు.

స్కూళ్ల మూసివేత ఉండదు

నూతన విద్యావిధానం వల్ల స్కూళ్లు మూతబడతాయనే ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు చేపట్టింది తరగతుల విలీనం మాత్రమేనని స్కూళ్ల విలీనం కాదని వివరించారు. కొత్తగా ఏర్పాటవుతున్న స్కూళ్ల వల్ల ఇప్పుడున్న పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ మూతబడవన్నారు. నూతన విద్యావిధానం అమలు తీరు తెన్నులపై సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరాలు తెలియచేశారు.

కొత్తగా వర్గీకరించిన ఆరు రకాల స్కూళ్లు, సిబ్బంది తదితర అంశాలపై వివరాలు అందచేశారు. 3 కి.మీ. లోపే హైస్కూల్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ మార్గదర్శకాలను అనుసరించే మ్యాపింగ్‌ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అధికారులకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించామని, జిల్లాల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమీక్షలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు. 

మండలానికి రెండు కాలేజీలు

‘‘నూతన విద్యా విధానంలో భాగంగా ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దాలని తొలుత భావించినా ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా మార్చాలని నిర్ణయించాం. ఒకటి కో–ఎడ్యుకేషన్‌ కాలేజీ కాగా మరొకటి కేవలం బాలికల కోసమే ఏర్పాటవుతుంది’’

– విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్‌