RUSSIA WAR: రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ధరల మోత! మనకి భారీగా పెరిగేవి ఇవే …!

 రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ధరల మోత! మనకి భారీగా పెరిగేవి ఇవే …!


ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు రష్యా దళాల స్వాధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధాని కీవ్‌ని వశం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నారు. ఐతే, దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. కానీ ఈ చర్య వల్ల రష్యాతో పాటు ప్రపంచానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు మోయరాని భారంగా మారనుంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దానికి ఇప్పుడు ఈ యుద్ధం తోడైంది. క్రూడాయిల్‌ ధరలు అనూహ్యంగా పెరిగి బ్యారెల్‌ 100 డాలర్లకు చేరింది. ఈ స్థాయికి పెరగటం గత ఎనిమిదేళ్లలో మళ్లీ ఇదే. మన దేశంపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మార్చి 7న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చంటున్నారు.

రష్యా, ఉక్రెయిన్ దేశాలు జర్మనీ, అమెరికా వంటి ప్రధాన ఉత్పాదక దేశాల నుంచి చేసుకునే దిగుమతులు చాలా తక్కువ. కానీ ఈ రెండు దేశాలు అనేక ఉత్పత్తులకు ముడి పదార్థాలు సమకూరుస్తాయి. కావాల్సిన ఇందనాన్ని అందిస్తాయి. చాలా ఐరోపా దేశాలు రష్యా ఇందనంపై ఆధారపడి ఉన్నాయి.

ప్రపంచ చమురు మార్కెట్‌లో రష్యా ఆధిపత్యం నడుస్తోంది. ఇది రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారు. ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యాది మూడో స్థానం. యూరప్‌, ఆసియా దేశాలలో దాదాపు సగం దేశాలు ముడి చమురు అవసరాలకు రష్యాపై ఆధారపడ్డాయి. గ్యాస్ మార్కెట్‌పై రష్యా భారీ ప్రభావం చూపుతున్నందున పరిస్థితి క్లిష్టంగా మారొచ్చు. చమురు, గ్యాస్‌లో మాత్రమే కాకుండా బొగ్గు, అణుశక్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి, ముడి చమురుతో పాటు, గ్యాస్ ధరలు కూడా ఎప్పుడైనా ఆకాశాన్ని తాకొచ్చు. ఒకవైపు చలికాలం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకు పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ- స్విఫ్ట్‌ నుంచి రష్యాను తొలగించడానికి యూరోపియన్‌ దేశాలు ఇష్టపడకపోవడానికి కారణం కూడా రష్యా దగ్గర ఉన్న ఈ గ్యాస్. ఐనా, ఈ యుద్ధం వల్ల జర్మన్‌ సహకారంతో రష్యా నిర్మిస్తున్న​​కొత్త బాల్టిక్ గ్యాస్ పైప్‌లైన్ నార్డ్ స్ట్రీమ్ 2 పనులను నిరవధికంగా నిలిపివేయక తప్పలేదు. మరోవైపు, కరోనా మహమ్మారి కారణంగా గ్లోబల్ గ్యాస్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవటంతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. దానికి తాజా పరిణమాలు తోడవటం వల్ల వినియోగదారులు, పరిశ్రమలపై మోయరాని భారం పడుతుంది.

Flash...   Alternative Academic Calendar Weekly work done - Alternative Links

చాలా సప్లయ్‌ చెయిన్లకు గ్యాస్ ప్రాథమిక అసవరం. కనుక గ్యాస్‌ సరఫరా నిలిచిపోతే భారీ ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది. 2021 శీతాకాంలో మొదటిసారి గ్యాస్‌ ధరలు పెరిగినపుడు ఇంధన వ్యయం భరించలేక బ్రిటన్‌లోని ఎరువుల ఫ్యాక్టరీ మూతపడ్డాయి. ఇది కార్బన్ డయాక్సైడ్ కొరతకు దారితీసింది. వైద్య ప్రక్రియల నుంచి ఆహారం తాజాగా ఉంచడం వరకు అన్నింటికీ ఇది అవసరం. కాబటటి పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరల వల్ల ఇలాంటి పరిణామాలకు ఆస్కారం ఉంది.

మరోవైపు, ప్రస్తుతం గోధుమల ధర పదమూడేళ్లలో అత్యధిక స్థాయికి చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఆసియా, మధ్యప్రాచ్య వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ప్రధాన సరఫరాదారులు. ప్రపంచంలోని గోధుమల వ్యాపారంలో పాతిక శాతం వాటా ఈ రెండు దేశాలదే. మొక్కజొన్న అమ్మకాలలో 20 శాతం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో ఎగుమతుల్లో 80 శాతం వాటాను ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయి. వ్యవసాయరంగం ఇప్పటికే సంక్షోభంలో పడింది. పలు అగ్రశ్రేణి ధాన్యం వ్యాపార సంస్థలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. తాజా పరిణమాలతో ఈ రంగం మరింత పడిపోతుంది.

ఉక్రెయిన్‌-రష్యా యుధ్దం రవాణా రంగంపై కూడా గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇప్పటికే, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఈ యుద్ధం ఈ రంగంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా సముద్ర రవాణా , రైలు సరుకు రవాణాపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2011 నుంచి చైనా, ఐరోపా మధ్య స్థిరమైన రైలు సరుకు రవాణా సంబంధాలు ఉన్నాయి. ఆసియా,యూరప్ సరుకు రవాణాలో దీని పాత్ర తక్కువే అయినా ఇటీవల ఇతర రవాణా మార్గాలకు అంతరాయం కలిగినపుడు ఇది చాలా ఆదుకుంది. దాని అవసరం ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. ఐతే, తాజా సంక్షోభం దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది.

మరోవైపు, రష్యా దండయాత్రకు ముందే ఓడ యజమానులు నల్ల సముద్రం షిప్పింగ్ రూట్లను నిలిపివేశారు. నల్ల సముద్రంలో కంటైనర్ షిప్పింగ్ అనేది ప్రపంచ స్థాయిలో సాపేక్షంగా ఉత్తమ మార్కెట్. దీనిని రష్యా దళాలు కట్‌ చేస్తే ఉక్రెయిన్‌ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్న సరుకు రవాణా ధరలు మరింత పెరగవచ్చు.

Flash...   Post Office Jobs: పది పాసైన వారికి పోస్టాఫీసులో నెలకి 56 వేల తో ఉద్యోగాలు..

ఇది ఇలావుంటే, సైబర్ దాడులు ప్రపంచ సరఫరా గొలుసులను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన కూడా ఉంది. నేడు వాణిజ్యం ఎక్కువగా ఆన్‌లైన్ లోనే జరుగుతోంది కాబట్టి కీలకమైన షిప్పింగ్ లైన్‌లు, మౌళిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి.

లోహ పరిశ్రమపై కూడా ఈ యుద్ధం విశేష ప్రభావం చూపనుంది. ఎందుకంటే నికెల్, రాగి, ఇనుము ఉత్పత్తిలో రష్యా , ఉక్రెయిన్ ప్రపంచంలోనే అగ్రగాములు. నియాన్, పల్లాడియం, ప్లాటినం వంటి ఇతర ముఖ్యమైన ముడి పదార్థాల ఎగుమతిలో కూడా ఇవి ముందున్నాయి. రష్యాపై ఆంక్షల భయంతో ఈ లోహాల ధరలు పెరిగాయి. పల్లాడియం విషయానికే వస్తే గత డిసెంబర్‌ నుంచి దాని ట్రేడింగ్ ధర ఔన్సుకు 2,700 డాలర్లు పెరిగింది. ఆటోమోటివ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్‌, మొబైల్ ఫోన్లు, డెంటల్ ఫిల్లింగ్‌ల వరకు ప్రతిదానిలో పల్లాడియంను ఉపయోగిస్తారు. తయారీరంగంతో పాటు నిర్మాణ రంగంలో ఉపయోగించే నికెల్, రాగి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అమెరికా, యూరోప్ , బ్రిటన్ ఏరోస్పేస్ పరిశ్రమలు కూడా రష్యా టైటానియంపై ఆధారపడి ఉన్నాయి. దాంతో, బోయింగ్ , ఎయిర్‌బస్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ప్రత్యామ్నాయ సరఫరాదారులను సంప్రదించినట్టు తెలుస్తోంది.

మైక్రోచిప్‌లపై కూడా తాజా సంక్షోభం ప్రభావం చూపనుంది. కరోనా కారణంగా గత ఏడాది మొత్తం మైక్రోచిప్‌ల కొరత వేదించింది. ఈ సంవత్సరం ఆ కొరత తీరుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో యుద్దం వచ్చిపడటంతో ఆ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆంక్షలలో భాగంగా రష్యా మైక్రోచిప్‌ల సరఫరాను నిలిపివేస్తామని అమెరికా ప్రకటిచింది. కానీ మైక్రోచిప్ ఉత్పత్తిలో ముఖ్యమైన నియాన్, పల్లాడియం, ప్లాటినంల కీలక ఎగుమతిదారులుగా రష్యా, ఉక్రెయిన్లు ఉన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న. చిప్ లితోగ్రఫీలో ఉపయోగించే నియాన్‌ లో దాదాపు 90 శాతం రష్యా లోనే లభిస్తుంది. చిప్ తయారీదారుల వద్ద ప్రస్తుతం రెండు నుండి నాలుగు వారాలకు సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య వల్ల ఏదైనా దీర్ఘకాలిక సరఫరా అంతరాయం ఏర్పడితే అది సెమీకండక్టర్లు, వాటిపై ఆధారపడిన ఉత్పత్తులపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యల నుంచి ప్రపంచదేశాలు ఎలా గట్టెక్కుతాయో చూడాలి!!

Flash...   Single Medium: పాఠశాలల్లో.. ఇక ఒకే మీడియం!