ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వాడుకోవద్దు: సీఎం జగన్‌

 ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వాడుకోవద్దు: సీఎం జగన్‌


అమరావతి: ఉపాధ్యాయుల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. దీని వల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదముంటుందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు ఉండాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాల్లో నాడు-నేడు సౌకర్యాలను మెరుగుపర్చాలన్నారు.

మార్చి 15 నుంచి నాడు-నేడు రెండో విడత పనులు మొదలుపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక అందించాలన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ఒక స్కిల్‌ కాలేజీతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీఐ కళాశాల ఉండాలని విద్యాశాఖ అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశించారు. కొత్త విద్యా విధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సీఎం సమీక్షించారు. గత సమావేశ నిర్ణయాలు, 6 కేటగిరీల కింద స్కూళ్ల ఏర్పాటుపై చర్చించారు. మ్యాపింగ్‌, సబ్జెక్టుల వారీగా టీచర్లు, ఆంగ్ల బోధన, డిజిటల్‌ లెర్నింగ్‌ తదితర అంశాలపై మాట్లాడారు. అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నైపుణ్య, మానవ వనరుల చిరునామాగా ఏపీ తయారు కావాలని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Flash...   వైరల్ ఫీవర్ పెరగడం కోవిడ్ యొక్క మరొక రూపమేనా ! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది?