AP కొత్త జిల్లాలపై హైకోర్టులో పిల్- రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం, విభజన చట్టానికీ-అభ్యంతరాలివే

 


ఏపీ కొత్త జిల్లాలపై హైకోర్టులో పిల్- రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం, విభజన చట్టానికీ-అభ్యంతరాలివే

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఉగాది నాటికి అంటే ఏప్రిల్ 2 నాటికి ఎట్టి పరిస్ధితుల్లోనూ కొత్త జిల్లాలు ఏర్పాటై తీరుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంచుకున్న సమయం మాత్రం వివాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తికాకుండానే ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం జిల్లాల విభజన చేపడుతోదంన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది

కొత్త జిల్లాలపై మరో వివాదం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పమదవుతున్నాయి. జిల్లాలను ఎంపీ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఏర్పాటు చేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. జిల్లా కేంద్రాల ఎంపిక కూడా వివాదాలకు ఆజ్యం పోస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం మొండిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో వివాదం తలెత్తింది. అసలు ఈ జిల్లాల విభజన గతంలో చేపట్టిన ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని హైకోర్టులో పిల్ దాఖలైంది.

కొత్త జిల్లాలపై హైకోర్టులో పిల్ 

ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులు, రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. గుంటూరు జిల్లాకు చెంది దొంతినేని విజయకుమార్‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెజ్జి సిద్ధార్థ, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామారావు ఈ వాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విభజన చట్టంలో గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో పాటు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం రేపు ఈ వ్యాజ్యంపై విచారణ జరపబోతోంది.

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం

Flash...   RBI New Rule: ఉద్దేశపూర్వకంగా లోన్ చెల్లించని వారికి ఉచ్చు బిగుస్తున్నట్లే.. RBI కొత్త రూల్.

 కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్దంగా ఉన్నాయని పిటిషనర్లు ఈ పిల్ లో ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు 1975 అక్టోబరు 18న రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని, ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల(స్థానిక క్యాడర్‌ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975ను ఉల్లంఘించేలా ఇవి ఉన్నాయని వారు ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా ఒక యూనిట్‌గా, జోన్‌ ఒక యూనిట్‌గా ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు జరుగుతోందని హైకోర్టు దృష్టికి తెచ్చారు ఆర్టికల్‌ 371డీ ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ వ్యవస్థను రూపొందించారని, కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జిల్లాల, జోన్ల భౌగోళిక స్వరూపం మారిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.

విభజన చట్టానికీ వ్యతిరేకం 

ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు 2014లో జరిగిన రాష్ట్ర విభజన చట్టానికీ వ్యతిరేకంగా ఉందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంబంధమైన విషయాలలో రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు ఏపీ విభజన చట్టంలో సెక్ష న్‌ 97 తీసుకొచ్చారని వారు గుర్తు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వు లు సవరించకుండా ఉద్యోగాల్లో ‘స్థానిక’ రిజర్వేషన్‌ మార్చడానికి వీల్లేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి జోన్లు మార్చే అధికారం లేదన్నారు. ఏపీలోని జిల్లాలకు భౌగోళిక సరిహద్దులు నిర్ణయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నోటిఫై చేశారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26గా పెంచడానికి చట్టం అనుమతించదన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే దాకా జిల్లాలను విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.

అభ్యంతరాలు పట్టించుకోరా? 

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా నోటిఫికేషన్ పై పలు అభ్యంతరాలు వచ్చాయని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయినా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టం-1974 నిబంధనల ప్రకారం .. ప్రతిపాదనలపై అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని, జిల్లాల ప్రతిపాదనలపై దాదాపు 8వేల అభ్యంతరాలు వచ్చాయిని వారు గుర్తుచేశారు. ఆ అభ్యంతరాలు పరిశీలించకుండానే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు మొదలు పెట్టాలంటూ ప్రభుత్వం ఫిబ్రవరి 26న జీవో 31 జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఖజానాపై మరింత భారం పడుతుందని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్‌, ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని, జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు హైకోర్టును కోరుతున్నారు.

Flash...   JIO సునామి అఫర్: 899 రూపాయలకే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చింది