CPS ABOLISHMENT: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి

 Andhra News: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి

‘సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి’ భగ్నానికి విస్తృత బందోబస్తు


ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు నేరవార్తలు, తాడేపల్లి: యూటీఎఫ్‌ తలపెట్టిన ‘సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి’ని భగ్నం చేసేందుకు పోలీసులు అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. క్యాంపు కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతాన్ని దిగ్బంధించారు. అక్కడ అయిదంచెల భద్రత ఏర్పాటుచేశారు. తనిఖీల కోసం 52 చోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. వెయ్యిమంది పోలీసుల్ని మోహరించారు. జాతీయ రహదారిపై నుంచి సీఎం నివాసానికి వెళ్లాలంటే తాడేపల్లి వద్ద సర్వీసు రోడ్డులోకి దిగాలి. అలా వెళ్లేందుకు వీల్లేకుండా 200 మీటర్ల మేర ఇనుప కంచె వేశారు. తాడేపల్లికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ తనిఖీలు విస్తృతం చేశారు. 

గుంటూరు జిల్లా పోలీసులతో పాటు రేంజ్‌ పరిధిలోని ఇతర జిల్లాల నుంచి బలగాలను రప్పించారు. సివిల్‌, ఏఆర్‌, ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ తదితర విభాగాల వారిని విధులకు పిలిపించారు. మారువేషాలు, సాధారణ దుస్తుల్లో పోలీసులు మాటు వేశారు. ఆదివారం రాత్రి నుంచి వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు అనుమానితులను, నిరసనకారులను, ఆయా సంఘాల వారిని అదుపులోకి తీసుకొని సమీప పోలీసుస్టేషన్లకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు ఆంక్షలు, నిర్బంధాల్ని లెక్కచేయకుండా ఎలాగైనా ముట్టడిని విజయవంతం చేయాలనే యోచనలో ఉపాధ్యాయులు ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులకు కార్యక్రమంలో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు.


పోలీసు వలయంలో విజయవాడ.. ప్రజలకు ఇబ్బందులు

విజయవాడ: సీపీఎస్‌ రద్దు కోరుతూ ఇవాళ ‘చలో సీఎం’వో ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విజయవాడ పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధిపై పోలీసులు భారీగా మోహరించారు. ఐడీ కార్డులు చూపించాలని పోలీసులు తమను దబాయిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. సమయానికి కార్యాలయాలకు, పనులకు వెళ్లేలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 

మరోవైపు తాడేపల్లి వైపు వెళ్లే  అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న ప్రయాణికుల సెల్ ఫోన్లను తీసుకొని ఉద్యోగుల వాట్సప్ గ్రూపులతో సభ్యులుగా ఉన్నారా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఉద్యోగిగా నిర్ధరణ అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. వారధి నుంచి కాజా టోల్‌గేట్‌ మధ్య ఎక్కడా ఆపొద్దని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు ఆదేశాలిస్తున్నారు.

ప్రజా ప్రభుత్వమా? పోలీస్‌ రాజ్యమా?: సీపీఐ రామకృష్ణ



విజయవాడలో పోలీసుల చర్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌తో సహా పలు ప్రాంతాల్లో వందలాది మంది పోలీసుల మోహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ మడమ తిప్పారని విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా?అని రామకృష్ణ మండిపడ్డారు
Flash...   Setting up and maintenance of School kitchen gardens - instructions issued