సబ్బు ఏ రంగులో ఉన్నా దాని నురుగు ఎందుకు తెల్లగా ఉంటుందంటే…
మీరు పలు రకాల రంగుల సబ్బులను వాడేవుంటారు. అయితే సబ్బుల నుంచి వచ్చే నురుగు ఎందుకు తెల్లగా ఉంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? సబ్బు రంగులోనే దాని నురుగు ఎందుకు ఉండదు? దీని వెనుక సైన్స్ ఉంది. సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత దాని రంగు ఎక్కడికి పోతుంది? ఆ వివరాలు తెలుసుకుందాం. సబ్బు నురుగు తెల్లగా కనిపించడానికి కారణం కాంతి కిరణాలు. ఏదైనా పదార్థం కాంతి కిరణాలన్నింటినీ గ్రహిస్తే అది నల్లగా కనిపిస్తుంది. అదే సమయంలో ఒక పదార్థంపై అన్ని కిరణాలు ప్రతిబింబించినప్పుడు, అది తెల్లగా కనిపిస్తుంది.
నురుగు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంతేకాకుండా సబ్బులో ఉపయోగించే రంగు ప్రభావవంతంగా ఉండదు. ఏథెన్స్ సైన్స్ నివేదిక ప్రకారం, సబ్బు రంగు ఏదైనా దాని నురుగు ఏర్పడినప్పుడు, అందులో నీరు, గాలి, సబ్బు ఉంటాయి. ఇవి గుండ్రని ఆకారంలో ఉండి బుడగల రూపంలో కనిపిస్తాయి. కాంతి కిరణాలు వాటిపై పడినప్పుడు, అవి ప్రతిబింబిస్తాయి. ఇది జరిగినప్పుడు ఈ పారదర్శక బుడగలు తెల్లగా కనిపిస్తాయి. సబ్బు నుండి ఏర్పడిన చిన్న బుడగలు పారదర్శక ఫిల్మ్‌తో తయారవుతాయని సైన్స్ చెబుతోంది, కాంతి కిరణం వాటిపై పడినప్పుడు, అన్ని రంగులు ప్రతిబింబిస్తాయి. సైన్స్ ప్రకారం, ఇది జరిగినప్పుడు, ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సబ్బు ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో ఉన్నప్పటికీ నురుగు తెల్లగా కనిపించడానికి ఇదే కారణం. అదే నియమం సముద్రాలు, నదులకు కూడా వర్తిస్తుంది. సముద్రంలోని నీరు నీలం రంగులో కనిపించడాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే దానికి దగ్గరగా వెళ్లి నీటిని పరిశీలించినప్పుడు దాని రంగు నీలం కాదని తెలుస్తుంది. నిజానికి నీటికి సూర్యకిరణాలను గ్రహించే శక్తి ఉంది. పగటిపూట సూర్యకిరణాలు నీటిపై పడినప్పుడు, నీరు కాంతి నుండి వచ్చే ఇతర రంగుల కిరణాలను గ్రహిస్తుంది. అయితే నీలి కిరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కారణంగా సముద్రం నీలి రంగులో కనిపిస్తుంది.