డిజిటల్ పద్దతిలో జన గణన.. 2024 తర్వాత ఆ అవసరమే ఉండదు:
Amit Shah on Census: ఈసారి జనాభా లెక్కలను డిజిటల్ పద్దతిలో నిర్వహిస్తునట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఇది పాలనలో విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవచ్చని.. జనన, మరణ ధృవీకరణ పత్రాలను నేరుగా డిజిటల్ సెన్సస్‌కు అనుసంధానం చేస్తామని అమిత్‌షా పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. అసోం రాజధాని గౌహతిలో జనాభా లెక్కల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పుట్టిన వెంటనే వాళ్ల వివరాలు జనాభా లెక్కల సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ అవుతాయని.. 18 ఏళ్లు నిండిన వాళ్లందరికి ఆటోమెటిక్‌గా ఓటర్‌కార్డులు అందుతాయని తెలిపారు. ఎవరైనా చనిపోతే వాళ్ల పేర్లు వెంటనే ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారన్నారు.
దేశంలో జనాభా లెక్కలను డిజిటల్ పద్ధతిలో మార్చడానికి కేంద్రం చాలా రోజుల నుంచి సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి తమ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత కల్పిస్తుందని అమిత్ షా ప్రకటించారు. ఒక వ్యక్తి 18 ఏళ్లకు రాగానే, ఆ వివరాలు జనాభా రిజిస్టర్‌లోకి వెళతాయన్నారు. ఈ లెక్కల ఆధారంగా ఓటర్ జాబితా తయారు అవుతుందన్నారు. 2024కల్లా జనన-మరణాల డిజిటలైజేషన్ మొదలవుతుందని అసోం పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (civil registration system) అని ఈ కార్యక్రమానికి పేరు సైతం పెట్టారు.
కరోనా కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనగణన వాయిదా పడిందన్నారు అమిత్‌షా. అయితే 2024 నాటికి డిజిటల్ సెన్సస్ తప్పకుండా పూర్తవుతుందన్నారు. డిజిటల్ సెన్సన్ రానున్న 25 ఏళ్లలో దేశాభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు అమిత్‌షా. జనాభా లెక్కలను పేపర్‌పై కాకుండా ఎలక్ట్రానిక్ పద్దతిలో నిర్వహించి తమ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించబోతుందన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్దికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచి కూడా డిజిటల్ జనగణనకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని అమిత్‌షా తెలిపారు. అసోం పర్యటనలో అమిత్‌షాతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా కూడా పాల్గొన్నారు