DIGITAL MONEY: మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా

మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా 

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల జోరు

తోపుడు బండ్ల నుంచి స్టార్‌ హోటళ్ల దాకా అదే తీరు

నోట్ల రద్దు, కరోనా, ఆఫర్లతో జనం డిజిటల్‌ బాట

2026 నాటికి లక్ష కోట్ల డాలర్ల లావాదేవీలు!

2030 కల్లా నగదు చెల్లింపులను దాటే చాన్స్‌

డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు భారత్‌ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో
ఏకంగా 7,422 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు
చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్‌ లావాదేవీలు లక్ష
కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్‌కు చెంది న క్యాపిటల్‌ మార్కెట్‌ సంస్థ
సీఎల్‌ఎస్‌ఏ అంచనా.

ఎందుకీ డిజిటల్‌ చెల్లింపులు?  

నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు
చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి…

1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం
జనాన్ని డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం
నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్,
ఆన్‌లైన్‌ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్‌ కార్డుల
ద్వారానే ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగాయి.

2. డిజిటల్‌ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్‌ వ్యాప్తి,
లాక్‌డౌన్, సామాజిక దూరంతో డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల
బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్‌లైన్‌
పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్‌ పేమెంట్‌
ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ
తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్‌ పే వంటివెన్నో వచ్చాయి.

3. డిజిటల్‌ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి
రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం.
ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్‌ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం
వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు
గూగుల్‌–బీసీజీ సర్వేలో తేలింది.

Flash...   పిల్లల చదువు కోసం డబ్బు సేవ్ చేయాలా ? .. చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్ లాభమేనా?

డిజిటల్‌ చెల్లింపులకు మార్గాలు  

డెబిట్, క్రెడిట్‌ కార్డులతో మొదలైన డిజిటల్‌ చెల్లింపులు ఇప్పుడు కొత్త
పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట
వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్‌ కార్డులు, స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌లు,
బ్యాంక్‌ యాప్‌లు, మొబైల్‌ వ్యాలెట్లు, పేమెంట్‌ బ్యాంకులు, ఆధార్‌ ఆధారిత
పేమెంట్‌ పద్ధతులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌
ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ (బీమ్‌)
యాప్‌ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్‌ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల
లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్‌స్టార్‌ హోటళ్ల దాకా
వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్‌లో 200 కోట్లున్న యూపీఐ
లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్న
భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. 

మార్చిలో మారిన ట్రెండు

డిజిటల్‌ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు
చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు
చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు
పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం
ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్‌ కూడా 2020తో
పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి.

ఎలా చెల్లిస్తున్నారు?

భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48
కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది
దాదాపు రెట్టింపు. ఆధార్‌ ఆధారిత విధానం (ఏఐపీఎస్‌) ద్వారా 3,00,380 కోట్ల
రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల
లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్‌ చెల్లింపులు జరిగాయి.

తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్‌) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా
రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. టోల్‌గేట్‌
చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్‌ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్‌ట్యాగ్‌ల
రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు
ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్‌ లావాదేవీలు విస్తరిస్తున్నా
దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు
చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్‌ చెల్లింపులు
నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా.

Flash...   WhatsApp: వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌.. వాయిస్‌ కాల్స్‌ NEW LOOK