KGF Chapter 2 OTT: ఓటీటీలో ‘కేజీయఫ్: చాప్టర్-2’ వచ్చేసింది.. కానీ..!
ఇంటర్నెట్‌డెస్క్: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘కేజీయఫ్: చాప్టర్2’(KGF Chapter2). యశ్(Yash) కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే రూ.1200 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కేజీయఫ్: చాప్టర్2’(KGF Chapter2 OTT)తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. అరే! భలే ఛాన్స్.. వెంటనే చూసేద్దాం అనుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ సినిమా ఇప్పటికిప్పుడే చూడాలంటే ముందస్తు సౌలభ్యం(ఎర్లీ యాక్సెస్) పేరిట అదనంగా రూ.199 చెల్లించాలంటూ ‘కేజీయఫ్2’లో ఉన్న ట్విస్ట్ కన్నా అదిరిపోయే ట్విస్ట్‌ను అమెజాన్ ప్రైమ్ ఇచ్చింది. దీంతో ఓటీటీలో ‘కేజీయఫ్2’ వచ్చేసిందనుకుంటూ ఆనందపడిపోతున్న అభిమానులు ఒక్కసారిగా ఉసూరుమంటున్నారు. అయితే, రాఖీభాయ్ అభిమానులు మాత్రం ‘ఛలో కేజీయఫ్2’ అంటున్నారు.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం. ‘కేజీయఫ్: చాప్టర్2’ చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరొక విషయం ఒకసారి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. అంటే ‘కేజీయఫ్2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా చూసేయాలన్నమాట. అది విషయం. మే 20 జీ5 వేదికగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా T-VOD ప్రాతిపదిక అందుబాటులో తీసుకొస్తున్నట్లు జీ5 చెబుతోంది.