SC, ST ఉద్యోగులకు..ఆ మెమో వ్యతిరేకం..

SC, ST  ఉద్యోగులకు..ఆ మెమో వ్యతిరేకం.. 


రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

పదోన్నతి కోసం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అది అవరోధం

వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమే!

పిటిషనర్లు బీపీఈడీ చదివేందుకు నిరాకరించడంపై మండిపాటు

నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడికి 4 వారాల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా కూడా


అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు జీతం, అలవెన్సులు పొందుతూ.. పదోన్నతి కోసం అవసరమైన డిగ్రీని అభ్యసించేందుకు అవరోధంగా ఉన్న ప్రభుత్వ మెమోను హైకోర్టు రద్దుచేసింది. నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ 2021లో ఇచ్చిన ఈ మెమో.. సదరు ఉద్యోగుల ప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం, సాంఘిక సంక్షేమ శాఖ 1977లో జారీ చేసిన జీవో 342కి విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఆ జీవోకు అనుగుణంగా ప్రయోజనాలు పొందేందుకు పిటిషనర్లు అర్హులని స్పష్టం చేసింది. వారికి జీతం, అలవెన్సులు చెల్లిస్తూ స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులకు అవసరమైన బీపీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) విద్యను అభ్యసించేందుకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అలా అనుమతించనందుకు అప్పటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడికి జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం తీర్పు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎ్‌సజీటీ)లుగా పనిచేస్తున్న తమకు పదోన్నతికి అవసరమైన బీపీఈడీని అభ్యసించేందుకు అనుమతి నిరాకరిస్తూ 2021 జనవరి 11న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఇచ్చిన మెమోను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన ఎస్‌జీటీలు బి.రాజేశ్‌, సి.చంద్రరావు, ఎ.సూరిబాబు, ఎం.విజయ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జీవీఎల్‌ మూర్తి వాదనలు వినిపించారు. ‘పిటిషనర్లు డీఈడీని అభ్యసించి ఎస్సీ కోటాలో ఎస్‌జీటీలుగా ఎంపికయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టుకుఅర్హత సాధించేందుకు బీపీఈడీలో ఉత్తీర్ణత సాధించాలి. 1977లో జారీ చేసిన జీవో 342 ప్రకారం.. జీతం, అలవెన్సులు పొందుతూనే పదోన్నతి కొరకు ఉన్నత చదువులు చదివేందుకు పిటిషనర్లు అర్హులు. ఆ జీవో ఆధారంగా తమకు అనుమతివ్వాలని కోరుతూ 2020 డిసెంబరులో విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ డైరెక్టర్‌ మెమో జారీ చేశారు. దానిని రద్దు చేయండి’ అని కోరారు. విద్యాశాఖ అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బ్యాచిలర్‌ డిగ్రీలున్న పిటిషనర్లు సంబంధిత సబ్జెక్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందేందుకు అర్హులు. బీపీఈడీని ప్రత్యేకంగా అభ్యసించాల్సిన అవసరం లేదు. ఈ నేపఽథ్యంలోనే పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించారు. ఎస్‌జీటీలను రెండేళ్ల పాటు బీపీఈడీ చదివేందుకు అనుమతిస్తే బోధనపై ప్రభావం చూపడమే కాకుండా ఖజానాపై భారం పడుతుంది’ అని పేర్కొన్నారు. ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

Flash...   Moon: మీరు ఎప్పుడైనా చంద్రున్ని ఇలా చూశారా?

ఆ జీవో ప్రశంసనీయం..

ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతికి అవసరమైన విద్యను అభ్యసించే సమయంలో జీతం, అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం 1977లో విధానపరమైన నిర్ణయం తీసుకుని జీవో 342 జారీ చేసిందని.. ఆ నిర్ణయం ప్రశంసనీయమని జస్టిస్‌ దేవానంద్‌ స్పష్టం చేశారు. ‘ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు నలుగురు పిటిషనర్లలో ముగ్గురు బీఈడీని అభ్యసించేందుకు అర్హులని, మరొకరు ఇప్పటికే బీఈడీ చదివారని.. పదోన్నతి పొందేందుకు ఆ డిగ్రీ సరిపోతుందని ప్రతివాదులు తమ కౌంటర్‌లో పేర్కొన్నారు. 2009లో జారీ చేసిన జీవో 12 ప్రకారం బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పొందిన వారు స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)కు అర్హులని నిబంధనలు చెబుతున్నాయి. పదోన్నతి పొందేందుకు ఏ డిగ్రీని అభ్యసించాలనేది పూర్తిగా పిటిషనర్ల ఇష్టం. ఫలానా పోస్టుల్లో పదోన్నతి పొందాలని అధికారులు నిర్దేశించడం సరికాదు. పిటిషనర్లు బీపీఈడీ  కాకుండా బీఈడీ చదవాలని బలవంతం చేయడం సహేతుక చర్య కాదు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన జీవోకి విరుద్ధంగా విద్యశాఖ మెమో జారీ చేయడం.. వారికి రాజ్యాంగం, చట్టం కల్పించిన హక్కులను హరించడమే. విధానపరమైన నిర్ణయం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన ప్రయోజనాలను హరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం పట్ల తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఆ మెమోను రద్దు చేస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు. 

DOWNLOAD GO MS 342 Dt:30.08.1977

ఆ క్షమాపణలో నిజాయితీ లేదు!

మరోవైపు న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా.. సకాలంలో బీపీఈడీ కోర్సు అభ్యసించడానికి పిటిషనర్లను సకాలంలో అనుమతించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పాఠశాల విద్యాశాఖ పూర్వ డైరెక్టర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చినవీరభద్రుడికి 4వారాల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పుఇచ్చారు. కోర్టు తీర్పు అమలు ఆలస్యమైనందుకు క్షమాపణలు చెబుతున్నట్లు అధికారి కౌంటర్‌లో పేర్కొన్నప్పటికీ న్యాయమూర్తి అంగీకరించలేదు. ఆ క్షమాపణలు నిజాయితీతో కూడినవిగా భావించడం లేదన్నారు. న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును రెండువారాలు నిలిపివేశారు. బీపీఈడీ చదివేందుకు పిటిషనర్లు బి.రాజేశ్‌, సి.చంద్రరావు, ఎ.సూరిబాబు, ఎం.విజయ్‌కుమార్‌లను అనుమతించాలని హైకోర్టు గత ఏడాది మార్చి 8న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అనుమతి నిరాకరిస్తూ అధికారులిచ్చిన మెమోను సస్పెండ్‌ కూడా చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులను సకాలంలో అమలు చేయకపోవడంతో ఎస్‌జీటీలు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దానిని విచారించిన న్యాయమూర్తి.. మార్చిలో కోర్టు ఉత్తర్వులిస్తే.. డిసెంబరు వరకు వాటిని అమలు చేయలేదని.. తమ ఉత్తర్వుల అమలు ఆలస్యం కావడానికి డైరెక్టర్‌ చినవీరభద్రుడే కారణమని పేర్కొంటూ జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.

Flash...   TCS NQT 2023: TCS గోల్డెన్‌ ఛాన్స్‌.. ఒకే పరీక్ష.. 2700 పైగా కంపెనీలు.. 1.6 లక్షల జాబ్స్‌!

DOWNLOAD GO MS 342 Dt:30.08.1977