Agnipath scheme – Agniveer: ‘అగ్నిపథ్’ పథకంతో ప్రయోజనం ఎవరికి ?

 Agnipath scheme – Agniveer: ‘అగ్నిపథ్’ పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్‌లకు మేలు ఎంత?

భారత సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం ‘అగ్నిపథ్’ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారంనాడు ప్రకటించారు.

ఈ పథకంలో భాగంగా యువకులకు నాలుగు సంవత్సరాలపాటు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు. ఆ తర్వాత వారికి సేవా నిధి ప్యాకేజ్ అందిస్తారు. ఈ పథకంలో ఉద్యోగం పొందిన వారిని అగ్నివీర్ అని పిలుస్తారు.

యువకులలో చాలామందికి ఆర్మీలో ఉద్యోగం పొందడం ఒక కల. కానీ, గత కొన్నేళ్లుగా సైన్యంలో నియామకాలు జరగడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగ సమయంలో ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు అగ్నివీర్ లకు ఇచ్చే ప్యాకేజీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

అగ్నిపథ్ పథకాన్ని సైన్యంలో ఆధునిక, రూపాంతర దశగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.

కొత్తగా నియమించే అగ్నివీర్ ల వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య ఉంటుందని, వారి జీతం నెలకు 30-40 వేల రూపాయల మధ్య ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

రిక్రూట్ అయిన యువతలో 25 శాతం మంది ఇండియన్ ఆర్మీలో కొనసాగుతారు. మిగిలిన వారు ఉద్యోగాన్ని వదిలేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ప్రభుత్వం 46 వేలమంది అగ్నివీర్ లను నియమించనుంది.

యువకులకు సైన్యంలో సేవలందించే అవకాశం కల్పిస్తామని, దేశ భద్రతను పటిష్టం చేసేందుకు, యువతకు సైనిక సేవలో అవకాశం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

ఈ పథకం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సర్వీసులో ఉన్న నైపుణ్యాలు, అనుభవంతో వారికి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయని ఆయన అన్నారు.

అగ్నిపథ్ పథకం గురించి క్లుప్తంగా మీరు తెలుసుకోవాల్సింది ఇదీ..

17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. పదో తరగతి లేదా ఇంటర్ పాసవ్వాలి.

అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.

మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం. మూడో ఏడాదిలో ప్రతి నెలా 36500 రూపాయల జీతం. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం.

జీతంలో నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని తీసుకుని కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. అలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

Flash...   Teachers Identity Card (Secondary) budget of Rs.26,45,100/- – Sanction – Orders

సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.

సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.

నాలుగేళ్ల తర్వాత పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. వీళ్లు సైన్యంలో 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.

అగ్నిపథ్ తో భారత సైన్యం రూపురేఖలు మారిపోతాయా?

ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం, యువతలో జాతీయ భావాన్ని బలోపేతం చేయడం, భారత సైన్యాన్ని యువసైన్యంగా మార్చడం, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే యువత ఆకాంక్షను నెరవేర్చడం ఈ పథకం లక్ష్యం.

భారత సైన్యపు సంప్రదాయ స్వభావాన్ని దెబ్బతీయడంతోపాటు, సైనికుల మనోధైర్యాన్ని ప్రభావితం చేసే పొరపాటు నిర్ణయంగా ఈ పథకాన్ని కొందరు విమర్శకులు తప్పుబడుతున్నారు.

“డబ్బును ఆదా చేయడం మంచిదే కానీ రక్షణ దళాలను పణంగా పెట్టి చేయకూడదు” అని రిటైర్డ్ మేజర్ జనరల్ షియోనన్ సింగ్ అన్నారు. దీన్ని ఆయన మూర్ఖపు చర్యగా పేర్కొన్నారు.

భారత సైన్యం పై జీతం, పెన్షన్ భారాన్ని తగ్గించడమే ఈ పథకాన్ని తీసుకురావడంలో ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని చాలామంది భావిస్తున్నారు.

“మేము ఏదో చేశామని, నిర్ణయాలు తీసుకునే పార్టీగా నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది” అని రిటైర్డ్ మేజర్ జనరల్ షెయోనన్ సింగ్ అన్నారు.

అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా భారత సైన్యాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేయాలనే అంశంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది.

నిరుద్యోగానికి ఇదే మందా?

భారత సైన్యంలో 68 శాతం పరికరాలు చాలా పాతవి, 24 శాతం పరికరాలు మాత్రమే నేటి కాలానికి చెందినవి. 8 శాతం అత్యాధునిక విభాగంలో ఉన్నాయి. దీనికి కారణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 2021-22 సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌లో 54 శాతం జీతాలు, పెన్షన్‌ల కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఒక డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో రక్షణ పెన్షన్‌ పై వ్యయం 12 శాతం పెరిగింది. రక్షణ బడ్జెట్‌లో సగటు పెరుగుదల 8.4 శాతమే ఉంది. రక్షణ బడ్జెట్‌లో పెన్షన్ 26 శాతానికి పెరిగి మళ్లీ 24శాతానికి తగ్గింది.

Flash...   వచ్చే ఏడాది నుంచే 'ప్రీ ఫస్ట్ క్లాస్' అమలు... AP ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశంలో ఉద్యోగాలు రాకపోవడం పెద్ద సమస్యగా మారిన తరుణంలో ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

”భారతదేశంలో నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్య. ప్రజలకు అవసరమైన ఉద్యోగాలు, ఉపాధి రేటు అంత వేగంగా పెరగడం లేదు” అని భారత ఆర్థిక వ్యవస్థను నిశితంగా పరిశీలించే సీఎంఐఈ సంస్థకు చెందిన మహేశ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు.

”కోవిడ్ కాలంలో భారతదేశంలో నిరుద్యోగం రేటు 25 శాతానికి చేరుకుంది. ఇప్పుడు ఈ రేటు 7 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో యువతలో (15-29 ఏళ్లు) నిరుద్యోగిత రేటు చాలా కాలంగా 20 శాతానికి పైగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాదిన్నర కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు” అని మహేశ్ వ్యాస్ అన్నారు.

మంచి పథకమా, చెడ్డ పథకమా?

”భారత సైన్యంలో నాలుగేళ్ల పాటు పనిచేయడం అంటే చాలా తక్కువ సమయం. నిజంగా ఇది మంచి ఆలోచన అయితే, దీన్ని దశలవారీగా అమలు చేయాలి. ఇంత తక్కువ సమయంలో ఒక యువకుడు సైన్యంతో ఎలా కనెక్ట్ అవుతాడన్న ఆందోళన కూడా ఉంది” అని రిటైర్డ్ మేజర్ జనరల్ షియోనన్ సింగ్ అన్నారు.

”నాలుగేళ్లలో ఆర్నెల్లు ట్రైనింగ్ లోనే ఉండాలి. ఆ తర్వాత పదాతి దళం, సిగ్నల్స్ వంటి విభాగాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీటికోసం వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుధాలను ఉపయోగించడానికి వారికి సరైన జ్ఞానం, అవగాహన ఉండాలి” అని సింగ్ అభిప్రాయపడ్డారు.

”అగ్నిపథ్ పథకంలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ కాలేడు. గ్రౌండ్స్‌మెన్‌ అవుతాడు.. మెకానిక్‌ అవుతాడు.. వర్క్‌షాప్‌కి వెళ్తాడు. కేవలం నాలుగేళ్లలో ఏం నేర్చుకుంటాడు?

అనుభవం ఉన్న సైనికుడితో కొత్తగా నియమితుడైన సైనికుడు యుద్ధానికి వెళితే, సీనియర్ మరణించినప్పుడు కేవలం నాలుగేళ్ల ట్రైనింగ్ తో ఆ వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయగలడా?” అని సింగ్ ప్రశ్నించారు.

భారత దేశానికి యుద్ధం కంటే తిరుగుబాటు లేదా దేశద్రోహం వల్ల ముప్పు ఉందని, దీనిని ఎదుర్కోవడానికి అనుభవజ్ఞుడైన, పరిణతి చెందిన మనసున్న వ్యక్తులు అవసరమని సింగ్ అన్నారు.

అయితే, ప్రభుత్వ నిర్ణయం భారత సైన్యానికి మేలు చేస్తుందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.బి. అస్థానా అన్నారు.

”ఐటీఐ నుంచి యువకులను తీసుకుంటే టెక్నికల్‌గా బాగుంటారు. సీనియర్లు, వృద్ధులు టెక్నికల్‌ పనిలో సమర్ధంగా పని చేయలేకపోవచ్చు. టెక్నాలజీలో ఈ తరం మరింత సత్తా చాటుతోంది. ఈ ప్రణాళికలో సైన్యానికి బాగా ఉపయోగపడే 25 శాతం మంది సైనికులను తమతోనే ఉంచుకోవడం, మిగిలిన వారిని వదిలేయడం వల్ల సైన్యానికి మేలు కలుగుతుంది” అని అస్థానా అన్నారు.

Flash...   చంద్రబాబు నాయుడు అరెస్ట్ - విజయవాడకు తరలింపు.

“ప్రస్తుతం మన వ్యవస్థలో ఒక జవాన్‌ ను చేర్చుకున్నాక, అతను సరిగా పని చేయడం లేదని భావిస్తే, అతని పై క్రమశిక్షణా రాహిత్యం లేదా అసమర్థత కేసు పెట్టకపోతే అతనిని తొలగించలేం” అని అస్థానా అన్నారు.

పథకంలో ఎంపికైన వారి భవిష్యత్తు ఏంటి ?

సైన్యంలో శిక్షణ పొంది పని చేసి వచ్చిన 21 ఏళ్ల నిరుద్యోగ యువకుడు తన శిక్షణను దుర్వినియోగం చేసి, సమాజానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని ‘అగ్నిపథ్’ పథకాన్ని విమర్శించే కొందరు చెబుతున్నారు.

టెన్త్ లేదా ఇంటర్ వరకు మాత్రమే చదవిన 21 ఏళ్ల యువత మళ్లీ ఎలా ఉపాధి సంపాదించుకోగలదని రిటైర్డ్ మేజర్ జనరల్ షెయోనన్ సింగ్ ప్రశ్నిస్తున్నారు.

“పోలీసు రిక్రూట్‌మెంట్‌ కు బీఏ పాసయిన యువకులు వస్తున్నారు. దీనివల్ల అగ్నివీర్ లు వెనకబడాల్సి వస్తుంది. చదువు ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రమోషన్‌ అవకాశాలు దెబ్బతింటాయి” అని ఆయన అన్నారు.

యువతకు 11 ఏళ్ల పాటు సైన్యంలో పని చేసే అవకాశం ఇవ్వాలని, ఎనిమిదేళ్ల తర్వాత వారు సగం పెన్షన్‌తో వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించాలని షెయోనన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

21 సంవత్సరాల గ్రాడ్యుయేట్ కు, అగ్నివీర్ గా పని చేసి వచ్చిన యువకుడికి మధ్య తేడా చాలా ఉంటుందని, సైన్యంలో పని చేసిన వచ్చిన యువకుడు ప్రత్యేకంగా ఉంటాడని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.బి. అస్థానా అన్నారు.

గ్రౌండ్ లెవెల్లో ఈ పథకం ప్రభావాన్ని పరిశీలించిన తర్వాత దాని భవిష్యత్తును నిర్ణయించాలని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా అన్నారు.

‘‘బడ్జెట్‌పై ఈ ప్లాన్ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఎనిమిది నుంచి పదేళ్లు పడుతుందని, అప్పుడు డబ్బులు మిగిలినట్లు తేలితే మిలిటరీ ఆధునికీకరణకు ఖర్చు చేయవచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

“ఈ పథకం కింద, రాబోయే నాలుగేళ్లలో 1.86 లక్షల మంది సైనికులను రిక్రూట్ చేస్తారు. ఇది సైనిక బలంలో 10 శాతం అవుతుంది. ఈ నాలుగేళ్లలో ఈ ప్రణాళిక ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. యువత ఆకర్షితులవుతున్నారా లేదా వారి మానసిక స్థితి ఏమిటి అన్నదానిపై ఆధారపడి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.