టీచర్ల కొత్త హాజరు..సవాలక్ష సందేహాలు


ఏకోపాధ్యాయ స్కూల్‌లో టీచర్‌ ఆలస్యమైతే పిల్లలకు పాఠాలుండవా?

7000కుపైగా పాఠశాలలపై స్పష్టత ఏదీ?

విలీన పంతుళ్లను తిరస్కరిస్తున్న యాప్‌

మొత్తంగా 50 శాతం మందే నమోదు

యాప్‌ల భారంపై ఆందోళన దిశగా ఉపాధ్యాయ సంఘాలు

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘‘ఏకోపాధ్యాయ పాఠశాల… ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు పాఠశాల చేరుకునేసరికి 9 గంటలు దాటిపోయింది. కొత్త హాజరు విధానంలో 9 గంటలకు ఒక్క నిమిషం దాటినా సెలవు పెట్టాల్సిందే. అలాంటప్పుడు ఆ రోజు బడి ఎవరు నడపాలి? పాఠాలు ఎవరు చెప్తారు? అసలు బడి ఉంటుందా? ఆ రోజుకు పిల్లలకూ సెలవు ప్రకటించి మూసేస్తారా?’’ మంగళవారం నుంచి కొత్త హాజరు విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తలెత్తుతోన్న ప్రశ్నలివి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్‌ సెలవు పెడితే ప్రస్తుతం కూడా ఇదే సమస్య. అయితే సెలవుపై ముందు రోజే సమాచారం ఉంటుంది కాబట్టి పక్క పాఠశాల టీచర్‌ను అక్కడ సర్దుబాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏదైనా ఒకరోజు ఆలస్యమైతే ఆటోమేటిక్‌గా సెలవు కింద పరిగణిస్తారు. ఆబ్సెంట్‌ అయినా తప్పదు కదా అని భావించి టీచర్‌ ఉంటే ఆ రోజు బడి నడుస్తుంది. ఎలాగూ ఆబ్సెంట్‌ పడింది కదా అని ఇంటికి వెళ్లిపోతే ఆ రోజుకు పక్క పాఠశాల టీచర్‌ను సర్దుబాటు చేసే సమయం కూడా ఉండదు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 7,000కు పైగా ఉన్నాయి. కొత్తగా తెచ్చిన యాప్‌ ఆధారిత ముఖ హాజరులో నిమిషం ఆలస్యమైనా సెలవు పెట్టుకోవాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పుడేం చేయాలన్న ఉపాధ్యాయుల ప్రశ్నకు సమాధానం లేదు.

DOWNLOAD NEW ATTENDANCE APP

హడావిడి ఆదేశాలతో పాట్లు

సోమవారం స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు వచ్చిన టీచర్లు వేడుకలు ముగిశాక కొత్త హాజరుకు ఫొటోలపై కుస్తీలు పట్టారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టీచర్లను మూడు కోణాల్లో ఫొటోలు తీయాలి. అది కూడా కచ్చితంగా పాఠశాల ఆవరణలోనే తీయాలి. ఈ ప్రక్రియను తప్పనిసరిగా సోమవారమే పూర్తి చేయాలని ఉత్తర్వులు స్పష్టంచేశాయి. మరోవైపు ఇటీవల విలీనంలో భాగంగా కొత్త పాఠశాలలకు వచ్చిన టీచర్లకు అదనపు ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటికీ వారి ట్రెజరీ ఐడీ పాత పాఠశాలలోనే చూపిస్తోంది. కానీ వారు పనిచేస్తున్న కొత్త పాఠశాలలో ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించగా మార్క్‌ చేసిన జీపీఎ్‌సలో లేదని వాటిని యాప్‌ తిరస్కరించింది. ఇప్పుడు వారేం చేయాలన్నదానిపై స్పష్టత రాలేదు. కాగా ఇంత చేసినా మొత్తంగా సుమారు 50 శాతం మంది టీచర్లే కొత్త హాజరుకు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అమలుకు హడావిడిగా ఆదేశాలు ఇచ్చినా సాంకేతిక అంశాలపై స్పష్టత రాకపోవడంతో టీచర్లు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Flash...   SBI: ఎస్‌బీఐ కొత్త సదుపాయం.. ఇంట్లోనే ఉండి రూ.35 లక్షల ప్రయోజనం

INSTALL  చేయాలా? వద్దా?

కాగా కొత్త హాజరు యాప్‌ సిమ్స్‌-ఏపీని ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలా? వద్దా? అనేదానిపై టీచర్లు అయోమయంలో ఉన్నారు. తాజా విధానంలో సమయం మరీ కఠినంగా ఉండటంతో అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అధికారులతో చర్చించాక నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకూ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. కానీ యాప్‌ ద్వారా ఫొటోలు తీయకపోతే ఆటోమేటిక్‌గా ఆబ్సెంట్‌ పడుతుందని, పైగా దీనిని అమలుచేయని హెచ్‌ఎంలపై చర్యలు ఉంటాయేమోనన్న భయం టీచర్లలో నెలకొంది. కాగా దీనిపై స్పష్టత కోసం మంగళవారం పాఠశాల విద్య కమిషనరేట్‌ అధికారులతో ఉపాధ్యాయ సంఘాలు చర్చించనున్నాయి. మరోవైపుపాఠశాలల్లో ఇప్పటికే వినియోగంలో రకరకాల యాప్‌లతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు కొత్తగా హాజరు యాప్‌ తోడయింది. దీంతో మొత్తం యాప్‌లపై ఉద్యమం చేపట్టాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

SOURCE: ఆంధ్రజ్యోతి