APPSC: ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వద్దు!

 


APPSC: ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వద్దు! స్పష్టం చేసిన ప్రభుత్వం

ఏపీపీఎస్సీ సభ్యుల ప్రతిపాదనకు తిరస్కరణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ) నిర్వహించాల్సిందేనంటూ ఏపీపీఎస్సీ సభ్యులు, కార్యదర్శి గట్టిగా పట్టుబట్టినా ప్రభుత్వం అంగీకరించలేదు. మౌఖిక పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగించాలని స్పష్టంచేసింది. అయితే… ఏ విధానం మంచిది? ఏ విధానంలో సరైన అభ్యర్థులు ఎంపికవుతున్నారో అధ్యయనం చేయాలని సూచించింది. ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఏపీపీఎస్సీ సభ్యులు మాత్రం… ‘‘ఉద్యోగాలను భర్తీ చేయాలంటే అభ్యర్థులను మేం ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటుచేసి అభ్యర్థుల తెలివి తేటలను, వారి మానసిక సామర్థ్యాన్ని పరిశీలించి ఎంపిక చేయాల్సిందే’’ అంటూ ప్రతిపాదించడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఏపీపీఎస్సీ సభ్యుల్లో సింహభాగం అధికార పార్టీ నేపథ్యంతో సభ్యులైన వారే కావడం గమనార్హం. అలాంటి సభ్యులు కొందరు కలిసి ఉద్యోగాలు ఇవ్వాలంటే మేం ఇంటర్వ్యూలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది.

ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని 2021 జూన్‌ 26న సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి మధ్య కొన్ని ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగాయి. తాజాగా ఈ నెల 21న ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖకు లేఖ రాసి ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించాలని బోర్డు సభ్యులతోపాటు కొందరు పౌరులు విన్నవించారని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి స్పందనగా సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి మార్చి 28న ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. అందులో ‘‘ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలంపాటు ఇంటర్వ్యూలు వద్దు. కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో నియమితులయ్యే వారి కోసం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల పద్ధతులను పరిశీలించిన తర్వాతే రద్దు ఉత్తర్వులిచ్చాం. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో పక్షపాత ధోరణి లేకుండా చూడటం పెద్ద సవాల్‌గా ఉండటం, బయటి వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రించలేకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించాకే ఇంటర్వ్యూలు ఉండకూదని నిర్ణయించింది’ అని పేర్కొన్నారు.

Flash...   నెలకి రూ.44,023 జీతం తో జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్..

నిబంధనలకు విరుద్ధంగా ఎపీపీఎస్సీ సభ్యుల నియామకాలు

రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం పదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వారు సగం మంది సభ్యులుగా ఉండాలి. మిగిలిన స్థానాల్లో ప్రజా బాహుళ్యంతో సంబంధమున్న వారిని నియమించాలి. ప్రస్తుత సభ్యుల నేపథ్యాన్ని పరిశీలిస్తే నిబంధనల అనుసరించిన దాఖలా కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. ప్రస్తుత ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఐపీఎస్‌ అధికారి. డీజీపీ హోదాలో ఉంటూ ఏపీపీఎస్సీకి నియమితులయ్యారు. మరో సభ్యుడు విజయకుమార్‌ ప్రభుత్వ సర్వీసులో పనిచేశారు. పద్మరాజు కాకినాడ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఏపీపీఎస్సీకి డిప్యుటేషన్‌పై వచ్చారు.