Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్‌ ఖాన్‌!

Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్‌ ఖాన్‌!


దాదాపు 100 కేసుల్లో నిందితుడిగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తనను హతమార్చేందుకు పోలీసులు ఈ అరెస్టుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

లాహోర్: తన హత్యకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అదే అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులోనే హత్య చేసే అవకాశం ఉందని, అందుకే విచారణకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అట్టా బండియాల్‌కు లేఖ రాశారు.

“గత శనివారం నేను తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్‌లోని ఫెడరల్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ కోర్టుకు వెళ్లాను. అక్కడ నన్ను చంపడానికి విఫలయత్నం జరిగింది. దాదాపు 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ఆవరణలో నన్ను చంపడానికి వేచి ఉన్నారు. సాధారణ దుస్తుల్లో ప్లాస్టిక్‌ సంకెళ్లు పట్టుకుని కన్పించారు. అందరూ నన్ను పట్టుకుని చంపాలనుకున్నారు.. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు.. అత్యంత భద్రత ఉన్న జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారనే దానిపై విచారణ జరగాలి.. ఇలాంటి విషయాలు వెల్లడిస్తూనే ఉన్నా. …నన్ను చంపడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు. కోర్టుకు వస్తే అక్కడే చంపేస్తారు.అందుకే విచారణకు వర్చువల్‌గా హాజరు కావడానికి అనుమతిని కోరుతున్నాను” అని ఇమ్రాన్ ఖాన్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి విచారించాలని ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు.

ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదం, హత్యలు మరియు దోపిడీ ఆరోపణలపై దాదాపు 100 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత శనివారం ఆయన కోర్టుకు హాజరైన సందర్భంగా, లాహోర్‌లోని ఆయన ఇంటిపై వేల మంది పోలీసులు దాడి చేసి పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. అదే సమయంలో ఇస్లామాబాద్‌లోని కోర్టు ఆవరణలో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు, పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ పరిణామాల తర్వాత, 300 మందికి పైగా PTI కార్యకర్తలను అరెస్టు చేసి తీవ్రవాద అభియోగాలు మోపారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీని కూడా బ్యాన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Flash...   బ్లూజోన్‌ డైట్‌ అంటే ఏంటి..? బరువు తగ్గడంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది..?