Big Alert: AP లోని ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం.. చెట్ల కింద ఉండవద్దని హెచ్చరిక..!

Weather Update.. AP లోని ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం.. చెట్ల కింద ఉండవద్దని హెచ్చరిక..


తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వర్షాలు, తుపానుల కారణంగా వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల ప్రజలను ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ అప్రమత్తం చేసింది.

ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పంట పొలాలు, బయట ప్రాంతాల్లో చెట్ల కింద ఉండరాదని వెల్లడించారు.

ఇదిలావుంటే.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. IMD అంచనా ప్రకారం, వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే  మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు.

Flash...   AP Weather: ఏపీకి భారీ వర్ష సూచన.. దూసుకొస్తున్న తుఫాన్, వాతావరణశాఖ అలర్ట్!