PLUS 2 SCHOOLS: ప్లస్‌ 2 స్కూళ్లు వచ్చేస్తున్నాయ్‌..!

 ప్లస్‌ 2 స్కూళ్లు వచ్చేస్తున్నాయ్‌..!

అనంతపురం విద్య, మార్చి 1: పూటకో నిర్ణయం… రోజుకో ఉత్తర్వు.. నెలకో వివాదం.. ఇవీ ఇప్పుడు విద్యాశాఖలో సాగుతున్న వ్యవహారాలు. ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ రెండున్నరేళ్లుగా ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు సమస్యలు, వివాదాలు, విద్యాశాఖలో గందరగోళానికి దారితీస్తున్నాయి. విద్యార్థుల నుంచి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అధికారుల వరకూ అందరూ బాధితులే. అందరూ తలలు బాదుకుంటున్నవారే. ఇటీవల స్కూళ్ల విలీనం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా ఇంటర్మీడియట్‌ కోర్సులను 10+2 స్కూళ్లలో అందిస్తామంటూ విద్యాశాఖ కొత్త రాగం అందుకుంది. వాటిని సీనియర్‌ సెకెండరీ స్కూళ్లతో తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 69 సీనియర్‌ సెకెండరీ స్కూళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 94 ప్రభుత్వ రంగలోని జూనియర్‌ కళాశాలలు నడుస్తున్నాయి. వీటిలోనే సదుపాయాలు కరువయ్యాయి. కొత్తగా ఇంటర్మీడియట్‌ కోర్సులు అందిస్తామంటున్న సీనియర్‌ సెకెండరీ స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కళాశాలలు లేని చోట… మండలానికి ఒకటి చొప్పున జిల్లావ్యాప్తంగా 236 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు మినహా ప్రభుత్వ రంగంలో 94 నడస్తున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020) అమలులో భాగంగా మండలానికి ఒక సీనియర్‌ సెకెండరీ స్కూల్‌ పేరుతో కొత్తగా ఏర్పాటుచేయబోతున్నట్లు సమాచారం. జూనియర్‌ కళాశాలలులేని చోట వీటిని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాపరిషత్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసి, సీనియర్‌ సెకెండరీ స్కూళ్లగా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో బాలికలకు ప్రత్యేకంగా, కో-ఎడ్యుకేషన్‌ సీనియర్‌ సెకెండరీ స్కూళ్లను సైతం స్థాపించేందుకు చూస్తున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 63 మండలాలకుగాను 6 చోట్ల గర్ల్స్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. దీంతో 57 మండలాల్లో బాలికలకు, మరో 12 మండలాల్లో కో-ఎడ్యుకేషన్‌ సీనియర్‌ సెకెండరీ స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు జిల్లా నుంచి పంపనున్నట్లు సమాచారం.

ఇంటర్‌ బోర్డు రద్దు చేయకుంటే సమస్యలే: హరికృష్ణ, ఎన్టీయే, రాష్ట్ర అధ్యక్షుడు

నూతన జాతీయ విద్యావిధానం అమలు క్రమంలో సీనియర్‌ సెకెండరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలంటే ఇంటర్‌ బోర్డు రద్దు చేయాలి. లేకుంటే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అడ్‌హక్‌ సర్వీసు రూల్స్‌ రూపొందించాలి. ఇంటర్‌ బోర్డును కూడా రద్దు చేస్తేనే… యాజమాన్యాల వారీగా ఉద్యోగన్నతులు ఇవ్వడం సులభమవుతుంది

Flash...   PGCIL లో 184 ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..