Single Medium: పాఠశాలల్లో.. ఇక ఒకే మీడియం!

 


పాఠశాలల్లో.. ఇక ఒకే మీడియం!

ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలు?

తెలుగు మాధ్యమం ఎత్తేసేందుకేనన్న అనుమానాలు

ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించేందుకేనని విమర్శలు

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఒకే మాధ్యమం ఉండేలా చాపకింద నీరులా ఏర్పాట్లు జరిగిపోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల తరగతుల వరకు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో ఏదో ఒకటే ఉండేలా చేయాలని అనధికారికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇది క్రమంగా తెలుగు మీడియం లేకుండా చేయడానికే అన్న అనుమానాలూ వస్తున్నాయి. కొద్దికాలం క్రితం వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. క్రమంగా కొన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెట్టారు. దీంతో పిల్లలకు ఏ మాధ్యమం కావాలంటే ఆ మాధ్యమం ఎంచుకునే అవకాశం ఉండేది.

చదవండి :PRC పై సీఎం జగన్ .. రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్..?

కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ఆంగ్ల మాధ్యమమే ఉండేలా  ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆంగ్ల మాధ్యమానికి మద్దతిచ్చేలా మాట్లాడుతున్నారు. దీనిపై విమర్శలు వస్తే…రెండు మాధ్యమాలూ ఉంటాయని పైకి చెప్తున్నా.. ఒకే మాధ్యమం ఉండేలా అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారని తెలిసింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ఒకే మాధ్యమం ఉండాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని డీఈవోలు, ఆ కిందిస్థాయి విద్యాశాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు చేరినట్టు సమాచారం. 

మాతృభాషలోనే కీలకం అంటున్న విద్యావేత్తలు..

పాఠశాల విద్య మాతృభాషలో జరిగితేనే పిల్లల్లో మనో వికాసం కలుగుతుందని విద్యావేత్తలు చెప్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అదే జరుగుతోందంటున్నారు. పసి వయసులో మాతృభాషలో బోధన జరిగితేనే ఆకళింపు చేసుకోగలుగుతారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్య కచ్చితంగా మాతృభాషలో జరగాల్సిందేనని, అలా జరిగితేనే పిల్లల్లో మనో వికాసం జరుగుతుందని పేర్కొంటున్నారు. తొలుత అన్ని విషయాలను మాతృభాషలో ఆకళింపు చేసుకుంటే…ఆ తర్వాత ఏ భాషనైనా అవలీలగా నేర్చుకోవచ్చని చెబుతున్నారు. ఇంటర్‌ నుంచి ఆంగ్ల మాధ్యమం ఎలాగూ ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లం ఒక సబ్జెక్టుగా కచ్చితంగా ఉంటుంది. అలా నేర్చుకుంటూ ఉన్నత విద్యకు వెళ్లేసరికి అవసరం అనుకుంటే పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అయినప్పటికీ ప్రాథమిక స్థాయి నుంచీ ఒకే మాధ్యమం ఉండాలన్న నిబంధన ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

Flash...   Vizag Cruise Service: క్రూయిజ్ షిప్‌లో ప్రయాణమంటే స్వర్గంలో విహారమే!

చదవండి : వివాదాలకు కారణమయ్యే ఉపాధ్యాయులపై చర్యలు

ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించేందుకేనా?

ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించేందుకే ఒకే మాధ్యమం అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 20వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో రెండు మాధ్యమాలు కొనసాగితే ఆ ఖాళీలన్నీ భర్తీ చేయాలి. ఇంకా ఎక్కువ ఉద్యోగాలూ భర్తీచేయాల్సిన అవసరం ఏర్పడొచ్చు. ప్రతిపక్షంలో ఉండగా మెగా డీఎస్సీ వేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కనీసం ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల కొరత ఉన్నా రెండున్నరేళ్ల నుంచి డీఎస్సీ మాత్రం వేయలేదు. భవిష్యత్తులోను ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించేందుకు వీలుగా ఒకే మాధ్యమం ఉండాలన్న నిబంధన పెడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఒకే మాధ్యమం అన్న మౌఖిక ఆదేశాలను ఉపసంహరించుకోవాలని అన్ని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.