‘రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం’ తెస్తాం

 ‘రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం’ తెస్తాం

ఇది కూడా విద్యా హక్కు చట్టంలాగే 

 20 ఏళ్ల తర్వాత ఏ పోటీలో అయినా 

 విద్యార్థులు విజయం సాధించేలా పునాది

 అమ్మఒడితో పెరిగిన చిన్నారుల సంఖ్య

 అసెంబ్లీలో సీఎం జగన్‌ వెల్లడి 

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత రెండన్నరేళ్లలో విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం విద్యారంగంపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచే విద్యావ్యవస్థను పటిష్ఠం చేయడం ద్వారా విద్యార్థులు… 20 ఏళ్ల తర్వాత ఎలాంటి పోటీ పరీక్షల్లో అయినా విజయం సాధించేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 96ు మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం కోరుకుంటున్నారని.. విద్యా హక్కు చట్టం మాదిరిగా ‘రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం’ను తెస్తామన్నారు. అంగన్‌వాడీ నుంచే ఇంగ్లీషు మీడియం వైపు చిన్నారులను మళ్లించనున్నట్టు తెలిపారు. విద్యాపరంగా సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించామని, అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే మరో టీచర్‌ను నియమించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మఒడి పథకం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెప్పారు. చిన్నారుల కోసం జగనన్న గోరుముద్ద పథకాన్ని తెచ్చామని, 44.50 లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. అమ్మఒడి పథకం కింద 85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని, ఈ ఏడాదికి రూ.6500 కోట్లు కేటాయించామని వివరించారు. జగనన్న గోరుముద్ద పథకం కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో కూడా సమూల మార్పులు తీసుకొచ్చామని, 57,189 ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి జరిగిందని సీఎం చెప్పారు. 

ఉన్నత విద్యలోనూ మార్పు

ఉన్నత విద్యలోనూ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు సీఎం జగన్‌ తలిపారు. విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నామని, వసతి దీవెన ద్వారా మెస్‌ చార్జీలు చెల్లిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది నుంచి 9-12 తరగతిలో అమ్మఒడి తీసుకోని విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని తెలిపారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థ యాజమాన్యాలకు మంచి జరగాలని నిర్ణయాలు తీసుకుంటే దానికి విపక్ష నేత చంద్రబాబు వాటికి వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు. గత 20 ఏళ్లుగా ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. ఎయిడెడ్‌ విలీనంపై బలవంతం లేదన్నారు. ‘చదువే అసలైన ఆస్తి, చదువే అసలైన సంపద’ అని సీఎం అన్నారు. ఈ చర్చలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నామని, కేంద్రం కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఇస్తోందని తెలిపారు. మధ్యాహ్నం భోజనం పథకంలో మనం రూపొందించిన మెనూను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ‘పీఎం పోషణ్‌’ పథకాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వం ప్రైవేట్‌ యూనివర్సిటీలు తీసుకొచ్చి భూమిని దారాదత్తం చేసిందన్నారు.

Flash...   Withhold the process of filling of left over vacancies in KGBVs