AP: గ్రామ,వార్డు మహిళా పోలీసులకు వరం.. సీఐ వరకు పదోన్నతి..!
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం.. సీఐల వరకూ పదోన్నతులకు అవకాశం
పోలీసు శాఖలో ప్రత్యేక వ్యవస్థగా రూపకల్పన
మహిళా పోలీసు బిల్లు ముసాయిదా సిద్ధం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని యోచన
సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు మహిళా పోలీసుల ఉద్యోగాలను త్వరలో క్రమబద్ధీకరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత ప్రోత్సహించనుంది. క్షేత్రస్థాయిలో మహిళల రక్షణ కోసం కీలకంగా వ్యవహరించే మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకోసం ముసాయిదా బిల్లును రూపొందించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
పోలీసు శాఖలో ప్రత్యేక వ్యవస్థగా..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేందుకు మహిళలు వెనుకంజ వేస్తున్నందున వారి సమస్యలను స్థానికంగానే గుర్తించి పరిష్కరించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 15వేలమంది మహిళా పోలీసులను నియమించారు. వారికి కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది.
వారి సర్వీసులను ప్రభుత్వం త్వరలోనే క్రమబద్ధీకరించనుంది. అందుకోసం రాతపరీక్ష, ప్రాజెక్టు వర్క్‌లు ఇప్పటికే పూర్తి చేసింది కూడా. ప్రస్తుతం మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసులకు కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ వారి హాజరు, సెలవుల మంజూరు, జీతాల చెల్లింపు అంశాలు సంబంధిత మున్సిపాలిటీలు/ పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి.
దాంతో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు సాధారణ పోలీసుల ఎంపిక ప్రక్రియ నిబంధనలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ఎంపిక ప్రక్రియ వేరేగా ఉంది. దాంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మహిళా పోలీసుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకోసం సాధారణ పోలీసులుగా కాకుండా మహిళా పోలీసులను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయనుంది. సాధారణ పోలీసులకు సమాంతరంగా మహిళా పోలీసు వ్యవస్థ ఉండనుంది.
పదోన్నతి అవకాశాలు కూడా..
►మహిళా పోలీసులకు పదోన్నతులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతం వార్డు/ గ్రామ సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు పదోన్నతుల కోసం ‘హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సీఐ’ పోస్టులను ఏర్పాటు చేస్తారు.
►పట్టణ ప్రాంతాల్లో అయితే కొన్ని వార్డులకు, గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు.
►పోలీస్ సర్కిల్ స్థాయిలో మహిళా ఏఎస్‌ఐ ఉంటారు.
►పోలీస్ సబ్–డివిజన్ స్థాయిలో మహిళా ఎస్‌ఐ ఉంటారు.
►పోలీస్ జిల్లాస్థాయిలో మహిళా సీఐ ఉంటారు.
ఈ పదోన్నతుల అంశంపై మరింతగా సమీక్షించి హోం శాఖ తుది ముసాయిదాను ఖరారు చేయనుంది. అనంతరం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది.