PRC ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా?

♦పీఆర్‌సీ ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా?

♦నివేదిక ఇవ్వడానికి ఇంతలా అవమానిస్తారా..?

♦ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ల ధ్వజం

♦నేటి జేఎస్‌సీ సమావేశంలో స్పందనను బట్టి.. కార్యాచరణ

🌻ఈనాడు డిజిటల్‌, అమరావతి: పీఆర్‌సీ నివేదికను బయటపెట్టేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటే ఏదో రహస్యం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. పీఆర్‌సీ త్వరగా ప్రకటించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ‘ఉద్యోగసంఘాలకు నివేదిక ఇచ్చేందుకే ఇన్నిరకాలుగా ఇబ్బంది పెడితే ఎలా? దీనికోసం ఇంతలా అవమానిస్తారా? మేం రెండు నెలలుగా అడుగుతున్నా ఎందుకు దాచిపెడుతున్నారు? గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. నివేదికలోని సిఫార్సులను మేమూ అధ్యయనం చేయాలి కదా? శాఖల నుంచి ప్రస్తావించిన డిమాండ్లను అందులో చేర్చారో లేదో చూసుకోవాలి. దీనిపై అధికారులు ఎందుకు దాటవేస్తున్నారు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు ఐకాస నేతలు గురువారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అంతకుముందు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో సమావేశమైనట్లు వెల్లడించారు.

♦నేటి సమావేశంలో పీఆర్‌సీపైనే దృష్టి

‘పీఆర్‌సీ నివేదికలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌.. వేతన స్కేలు ఎంత సిఫార్సు చేశారో తెలియకుండా ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని మేం డిమాండు చేయలేం. కొన్ని శాఖల ఉద్యోగులకు అన్యాయం జరిగితే.. ప్రత్యామ్నాయంగా మరో కమిటీని నియమిస్తారు. ఇవన్నీ జరగాలంటే నివేదికను బయటపెట్టాలి. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలి. అక్టోబరు 29న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం పీఆర్‌సీ నివేదిక తప్పనిసరిగా ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. తర్వాత నవంబరు 8న, అనంతరం 10న ఇస్తామని చెప్పారు. శుక్రవారం నిర్వహించే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పీఆర్‌సీ అంశంపైనే దృష్టిసారిస్తాం. అధికారులనుంచి వచ్చే సమాధానాన్ని బట్టి.. ఇరు ఐకాసలు సమావేశమై కార్యాచరణ వెల్లడిస్తాం’ అని స్పష్టం చేశారు.

Flash...   ఓమైక్రాన్ అనే మ్యుటేషన్ తీవ్రమైనదా?

♦తప్పుదారి పట్టిస్తారా..?

రెండు ఐకాసల నేతలు అధికారుల ముందు ఒకలా.. బయట మరోలా మాట్లాడుతున్నారని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారని విలేకర్లు ప్రశ్నించగా.. ‘రెండు పెద్ద ఐకాసలు పీఆర్‌సీ కోసం పోరాడుతుంటే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డికి ఏదో ప్రయోజనం ఉండటం వల్లే అలా మాట్లాడుతున్నారు.  దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. పీఆర్‌సీ ఏడాదిన్నర ఆలస్యమైంది. ఏడు డీఏలు ఇవ్వాలి. మా లక్ష్యం పీఆర్‌సీ, ఉద్యోగుల సమస్యలపై పోరాడటమే. భేషజాలు పక్కనపెట్టి ఐక్య పోరాటాలు చేయాలనే కలిశాం. ఉద్యోగుల సేవకు పోటీ పడాలే గానీ తప్పుదోవ పట్టించొద్దు. పదవులు మేం కోరుకుంటాం. అవి ఇవ్వడం ప్రభుత్వం ఇష్టం. పీఆర్‌సీ ఇస్తే ఐకాసల్లోని ఉద్యోగులకే కాదు.. వెంకట్రామిరెడ్డికీ లబ్ధి చేకూరుతుంది’ అని వివరించారు.