Ammavodi Scheme: అమ్మఒడిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. వచ్చేఏడాది నుంచి ఈ మార్పులు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం (Jagananna Ammavodi Scheme) ఒకటి. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఏడాది రూ.15వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఇప్పటికే రెండేళ్ల పాటు అమ్మఒడి పథకం కింద లక్షలాది మందికి పథకాన్ని అందించింది. ఈ నేపథ్యంలో పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం..స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ప్రధానంగా అమ్మఒడి పథకంపైనే చర్చ జరిగింది. పథకం అమలులో ఇకపై హాజరు తప్పనిసరితో పాటు, పథకం తేదీని కూడా మార్చే అవకాశాలున్నాయి.

ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాలని… పిల్లలంతా బడిబాట పట్టాలని సూచించారు. అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టామన్న జగన్…కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొంది అభిప్రాయపడ్డారు.

రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా పాఠశాలలు సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిందన్న జగన్.., అమ్మ ఒడి అమలుకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధనను మనం పరిగణలోకి తీసుకోలేని పరిస్థితులు వచ్చాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించామని.., మార్చి చివరి వారంలో కోవిడ్‌ ప్రారంభమైందన్నారు. దీంతో స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తిరిగి 2020, నవంబరు, డిసెంబరుల్లో పాఠశాలలు తెరిచామని.., జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చిన వెంటనే మళ్లీ రెండో వేవ్‌ కోవిడ్‌ వచ్చిందన్నారు. పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు వచ్చాయని.., ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించామన్నారు సీఎం.

Flash...   DSC 2008 CANDIDATES SCHEDULE RELEASED

హాజరుతో లింక్

2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నామని.., ఈ ఏడాది ఈ నిబంధనను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. సాధారణంగా జూన్‌లో స్కూళ్లు ప్రారంభం అయితే ఏప్రిల్‌ వరకూ కొనసాగుతాయన్నారు. ఆ విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్నారు. హాజరును పరిగణలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని జగన్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ కూడా పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలన్నారు. అకడమిక్‌ ఇయర్‌తో అమ్మ ఒడి అనుసంధానం కావాలి స్పష్టం చేశారు.

కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు చెప్పారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయినందున వారుకూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి.., ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరు నాటికి 85శాతం నమోదైందని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని సీఎంకు వివరించారు.