PRC కి ఇక ముందడుగే! రోడ్డు మ్యాప్ దిశగా కసరత్తు
ఆగస్టు 16 – ఆంధ్రప్రదేశ్ లో 11వ వేతన సవరణ కమిషన్ నివేదికను అమలు చేసే విషయంలో ప్రభుత్వం కాస్త సీరియస్ గానే ఉన్నట్లు విశ్వససీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలియజేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో రెండ్రోజుల కిందట పీఆర్సీతో పాటు ఉద్యోగుల ఇతర అంశాలపైనా సమీక్షించారు. ఉద్యోగుల నుంచి ఒత్తడి పెరగడం, తెలంగాణ రాష్ర్టంలో ఇప్పటికే పీఆర్సీ అమలు చేయడం, ఇప్పటికే నివేదిక చేతికి అంది దాదాపు ఏడాది కావస్తుండటంతో ఇక అమలును ఆలస్యం చేయలేమనే యోచనలో సర్కార్ పెద్దలు ఉన్నట్లు తెలిసింది.
– సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాల కన్నా ముందు పీఆర్సీ అమలు, కొత్త బదిలీల విధానమే కొలిక్కి వస్తాయని అధికారులు కొందరు పేర్కొంటున్నారు.
– సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల అంశాలకు మరికొంత సమయం పడుతుంది.
– పీఆర్సీలో కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని, వాటిని అమలు చేయడం వల్ల ఆ రీత్యాను కాంట్రాక్టు ఉద్యోగులను సంతృప్తి పరచవచ్చనే యోచన కనిపిస్తోంది.
– పీఆర్సీ అమలు అందరు ఉద్యోగులకు వర్తించేది అయినందున అది అమలు చేస్తే మిగిలిన విషయాల్లో కొంత ఒత్తిడి కొంత కాలం తగ్గుతుందనే యోచనా ఉంది.
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం నిర్వహించిన సమీక్ష యధాలాపంగా చేసింది కాదని సమాచారం.
– ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పక్కా గా రూట్ మ్యాప్ రూపొందించే క్రమంలోనే అడుగులు ముందుకు పడుతున్నాయని తెలిసింది.
– ఇప్పటికే 27శాతం ఐఆర్ ఇస్తున్నారు. ఫిట్ మెంటు భారం మరో 5 నుంచి 6 శాతం వరకు పరిగణనలోకి తీసుకుని లెక్కలు కడుతున్నట్లు సమాచారం.
– ఆర్థికశాఖ ఇందుకు సంబంధించిన వ్యూహం రూపొందించాల్సి ఉంది. వారి కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత…. వారి అధ్యయనం సమాచారం చేతిలో ఉంచుకుని సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పని మొదలు పెడుతుంది.
– సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సమావేశం నిర్వహించి తన నివేదికను మంత్రివర్గానికి సమర్పిస్తుంది.
– ఆ తర్వాతే పీఆర్సీ నివేదిక బయటకు వచ్చి చర్చల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.
– రాబోయే కొద్ది నెలల్లో తుది దశకు ఇది చేరనుంది. (-UDYOGULU.NEWS)