AP Inter Results: కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలోని అన్ని
రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే
తొలుత ఏపీ ప్రభుత్వం మాత్రం చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే
ఉద్దేశంతోనే ఉంది. కానీ.. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు పరీక్షలను రద్దు చేసిన
విషయం తెలిసిందే. జులై 31లోపు పరీక్షా ఫలితాలను ప్రకటించాలన్న సుప్రీం ఆదేశాల
మేరకు.. అంతలోపు పరీక్షలను నిర్వహించి, ఫలితాలను విడుదల చేయడం అసాధ్యమని
భావించిన ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఇంటర్ సెకండ్
ఇయర్ ఫలితాలను ఏ ప్రతిపాదికన ఇవ్వనున్నారన్న దానిపై తాజాగా ప్రభుత్వం కీలక
నిర్ణయం తీసుకుంది.
పదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని 12వ
తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. థియరీ పేపర్ మార్కుల కోసం..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల నుంచి 70 శాతం వేయిటేజ్, 10వ తగరతిలో వచ్చిన
మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్‌గా తీసుకొనున్నారు. ఇక ప్రాక్టికల్
పరీక్షలకు విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా
తీసుకోనున్నట్లు ఇంటర్మిడియట్ బోర్డు అధికారికంగా తెలిపింది.
ఇక జులై 31లోపు ఫలితాలను ప్రకటించాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ఏపీ
ఇంటర్మిడియట్ బోర్డ్ ఆ దిశలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పరీక్షా
ఫలితాలను ఏ ప్రాతిపాదికన విడుదల చేయాలన్నదానిపై ప్రభుత్వం హై పవర్ కమిటీని
ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏడాది దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి,
ఇంటర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. కొత్త అకాడమిక్
ఆన్‌లైన్ తరగతులను జులై 12 నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే
నిర్ణయం తీసుకుంది. ఇక ఆఫ్‌లైన్ తరగతులను ఆగస్టు 16 నుంచి ప్రారంభిస్తామని
ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కరోనా థార్డ్ వేవ్ పొంచి ఉందని వార్తలు
వస్తోన్న నేపథ్యంలో.. పాఠశాలల పునఃప్రారంభంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని
రోజులు చూడాల్సిందే.